మోమోస్ మృతి కేసులో కీలక విషయాలు
బంజారాహిల్స్ నంది నగర్లో మోమోస్ తిని మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్‌లోని నంది నగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలలో శుక్రవారం సంత జరిగింది. ఈ సంతలో ఏర్పాటు చేసిన డిల్లీ హాట్ మోమోస్ దుకాణంలో మాంసాహార మోమోస్, దానికి ఇచ్చిన మయోనైజ్, చట్నీని తిన్న రేష్మ బేగం, ఆమె పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ఆదివారం నాటికి రేష్మబేగం పరిస్థితి విషమించి, నిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఈ షాపులో మోమోస్ తిన్న 50 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఖైరతాబాద్ చింతలబస్తీలో ఒక గదిలో ఎండీ రజిక్, సాజిద్ హుస్సేన్ అనే వ్యక్తులు ఈ మోమోస్‌ను, నాసిరకం పదార్థాలతో మయోనైజ్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రజిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సాజిద్ హుస్సేన్ కోసం గాలిస్తున్నారు.