Exclusive: – హర్యానా గ్రౌండ్ సిచ్యువేషన్… గెలిచేదెవరు?
ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణం. వరుస విజయాలు సాధించిన తర్వాత ఎవరికైనా ఓటమి తప్పదు. కానీ అదే పనిగా వరుస విజయాలు సాధించినవారు చరిత్రలో నిలిచిపోతారు. నాడు కురుక్షేత్రం సాక్షిగా మహాభారత యుద్ధం జరగ్గా, ఇప్పుడు అదే కురుక్షేత్రంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హర్యానా సమరం సాగుతోంది. ఈ ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో గెలవలాని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్లకు గడువు ముగియడంతో, రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచారం ప్రారంభమైంది. హర్యానా పోలింగ్ అక్టోబర్ 5న జరగనుంది. ప్రస్తుతం, బీజేపీ హర్యానాలో మూడు రకాలుగా ప్రభుత్వ వ్యతిరేకతతో పోరాడుతోంది. ఐనప్పటికీ ఎన్నికలలో గెలవాలని తిరుగులేని పోరాటం చేస్తోంది.

ఇక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ప్రచారం సాగుతున్నప్పటికీ, బీజేపీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ సాగింది. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరు గెలుస్తారన్నది చివరి నిమిషం వరకు ఉత్కంఠే. హర్యానా ఎన్నికల్లో ప్రస్తుత సమాచారం మేరకు 1,745 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక్కో సీటుకు దాదాపు 20 మంది పోటీ పడుతున్నారు. ఉపసంహరణకు ఇవాళ చివరి (సెప్టెంబర్ 16). టికెట్ల పంపిణీ రాష్ట్రంలో బీజేపీలో తిరుగుబాటుకు దారితీసింది. ముఖ్యంగా ఈ పరిస్థితి బీజేపీలో కన్పించింది. మొత్తంగా ఈ ఎన్నికల వేళ, కాంగ్రెస్ తక్కువ అసమ్మతిని ఎదుర్కొంది. టికెట్ నిరాకరించిన పలువురు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ 15 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ముగ్గురికి టికెట్లు ఇవ్వలేదు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్-బహుజన్ సమాజ్ పార్టీ, జననాయక్ జనతా పార్టీ-ఆజాద్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు ప్రధాన పార్టీలు రేసులో ఉన్నాయి. వీరితోపాటుగా చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల సుమారుగా 15 మంది వరకు పోటీలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో, పార్టీలు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా రెబల్స్‌ను ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. హర్యానాలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, బీజేపీకి సవాలు విసురుతున్నాయ్. 1966లో ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి గెలవలేదు. అయితే, ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ ముఖ్యమంత్రిని మార్చి సాహసం చేసింది. ఇలా సీఎం మార్పు చేయడంతో, ఆయా రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించింది. ఇలా వ్యూహాన్ని అమలు చేసిన ఏ రాష్ట్రంలోనూ అంటే, గుజరాత్, ఉత్తరాఖండ్, త్రిపురలో పార్టీ ఓడిపోలేదు.

హర్యానాలో పొజిషన్ బీజేపీకి గందరగోళంగా కన్పిస్తోంది. ఓవైపు మోదీ సర్కార్‌పై వ్యతిరేక, స్థానిక బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాట్ల, ముఖ్యమంత్రిపై విముఖత, స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత బీజేపీని గందరగోళంలో పడేస్తు్న్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ, బీజేపీపై అధికార వ్యతిరేకత స్వల్పంగా నమోదు కావడంతో రెండు పార్టీలు 5-5 సీట్లను గెలుచుకున్నాయి. రైతుల నిరసనలను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. 61% మంది రైతులు ఇండియా కూటమికి మద్దతు పలికారు. జాట్ కమ్యూనిటీ, బీజేపీ సర్కారుపై తిరుగుబాటు ప్రకటించింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మల్లయోధులు లైంగిక వేధింపుల ఆరోపణలపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న కోపం మహిళల్లో ఉంది. దాదాపు 49% మంది మహిళలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. ముఖ్యంగా, పారిస్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ జట్టులో 20% మంది హర్యానాకు చెందినవారు కావడమన్నది చిన్న విషయం కాదు. వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తారు.

సాయుధ బలగాల నియామకం విషయంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా యువత నిరసనలు చేస్తున్న సమయంలో బీజేపీ నేతలు పత్తా లేకుండా పోయారు. భారత సైన్యంలోని 11% మంది సైనికులు హర్యానా నుండే ఉన్నారు. 18-25 సంవత్సరాల వయస్సు గల ఓటర్లలో 47% మంది ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాలు హర్యానాలో బీజేపీకి విషమ పరిస్థితి కలిగిస్తున్నాయి. 2019లో మొత్తం 10 స్థానాలను గెలుచుకున్న పార్టీ, 2024లో సగం సీట్లకు పరిమితమైంది. మిగిలిన ఐదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. BJP ఓట్ల శాతం 12 తగ్గగా, కాంగ్రెస్ ఓట్లు 16 శాతం పెరిగాయి. BJP 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉండగా, (2019లో 35కి తగ్గింది). అయితే ఇండియా బ్లాక్ 46తో (36 పెరిగాయి) ఆధిక్యంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను బీజేపీ తొలగించడం కూడా రచ్చకు కారణమవుతోంది. 2014 విజయం తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో విజయం సాధించిన బీజేపీ… అక్కడి ఆధిపత్య కుల రాజకీయాలకు భిన్నంగా, మనహర్ లాల్ ఖట్టర్‌ను తెరపైకి తెచ్చింది. అసలే కాక మీద ఉన్న జాట్ కమ్యూనిటీ మరింత సైడ్ చేసేంది. సీఎం పీఠాన్ని బీజేపీ OBC నయాబ్ సింగ్ సైనీకు సీఎం పీఠం అప్పగించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE ప్రకారం హర్యానాలో దేశంలోనే అధిక నిరుద్యోగం ఉంది. ఆగస్ట్ 2024కి ద్రవ్యోల్బణం రేటు 4.12% కాగా దేశ సగటు 3.65 శాతమే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన సమస్యలుగా గుర్తించారు.

బీజేపీ హయాంలో నేరాలు గణనీయంగా పెరిగాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 నివేదిక ప్రకారం క్రిమినల్ కేసుల్లో 17.6% పెరుగుదలతో మొత్తం 2.43 లక్షల కేసులు నమోదయ్యాయన్న విషయాన్ని ప్రచారం చేస్తోంది. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఢిల్లీ తర్వాత హర్యానా రెండో స్థానంలో ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యేనే కీలకం. పోటీ చేసేదెవరన్నదానిపై గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయంటారు. 2014 స్టేట్ ఎలక్షన్స్‌లో 36% మంది ఓటర్లు, అభ్యర్థి ఆధారంగా ఓటేశారని CSDS పోస్ట్-పోల్ అధ్యయనం పేర్కొంది. అందుకే తాజాగా బీజేపీ 15 మంది ఎమ్మెల్యేలను మార్చింది. ముఖ్యమంత్రితో సహా మరో ముగ్గురి సీట్లను మార్చింది. 37% మందికి టికెట్లు నిరాకరించింది. స్థానికంగా ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించేందుకు అసెంబ్లీలో దాదాపు మూడింట రెండొంతుల స్థానాల్లో 57 స్థానాల్లో కొత్త అభ్యర్థులను నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించే చరిత్ర హర్యానాలో చాలా ఎక్కువ. 2019 ఎన్నికలలో, బీజేపీ 47 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 34 మందిని కొనసాగించింది. వారిలో సగం మంది ఓడిపోయారు. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్లిచ్చింది. ఐతే సగం మంది ఓడిపోయారు. కాంగ్రెస్, బీజేపీలు తిరిగి టికెట్లిచ్చిన వారిలో 49 మంది అంటే సగం మంది ఎన్నికల్లో ఓడిపోయారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లను కోల్పోవడం బీజేపీని భయపెట్టిస్తున్నాయి. హర్యానాలో, 2014 సార్వత్రిక ఎన్నికలలో 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, ఆరు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికలలో అది 47కి తగ్గింది. 2019లో 79 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో సగానికి 40కి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతం 58% గా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో అది 37% కి తగ్గింది. ప్రాథమిక సర్వేల ప్రకారం ప్రస్తుతం హర్యానాలో విజయం కాంగ్రెస్ పార్టీకి నల్లేరుపై నడకేనన్న భావన ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఎన్నికలు మరింత క్లిష్టంగా మారే అవకాశం లేకపోలేదు. 2023 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలు రెండింటిలోనూ రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. చివరి ఓటు లెక్కించే వరకు భారతదేశంలో ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం అంత వీజీయేం కాదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 2023 ఫలితాల మాదిరిగానే లేదా చిన్న పార్టీల ప్రభావంతో హంగ్ తీర్పు వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఒక మనోహరమైన పోటీ హర్యానాలో దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.