Home Page SliderNational

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నారాయణ్‌పేట్ యువకుడు

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. అలాగే ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా ఇలాగే వ్యవహరిస్తోందనిపిస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్‌ను ఓడించితీరుతామన్న దీమాలో ఉన్న రష్యా, పెద్ద ఎత్తున బలగాలను కోల్పోయింది. అమెరికా, ఈయూ దేశాలు అందించిన అధునాతన ఆయుధాలతో రష్యా సేనల వెన్నువిరిచింది. రష్యాతో పోరాటంలో ఇబ్బందులెదుర్కొంటున్నప్పటికీ, ఉక్రెయిన్ గట్టి పోరాట పటిమ చూపించింది. దీంతో బలగాలను కోల్పోయిన రష్యా, కొత్త ఎత్తుగడ వేసింది. ఆసియా దేశాల్లో నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకొని రష్యా సెక్యురిటీ విభాగంలో అవకాశాలంటూ ప్రకటనలు గుప్పించింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆసియా, ఆఫ్రికన్లు రష్యా మిలటరీలో పనిచేస్తున్నట్టు తాజా నివేదికలతో తెలుస్తోంది.

ఉపాధి ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేసిన తెలంగాణ, నారాయణపేట్ యువకుడు మహ్మద్ సుఫియాన్ సెప్టెంబర్ 14న ఇంటికి తిరిగి వచ్చాడు. సుఫియాన్ తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యానికి సహాయం చేస్తున్నందున, అతని భద్రత గురించి కుటుంబ సభ్యులు ఆందోళనపడ్డారు. భద్రత విభాగంలో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసి, రష్యాకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. యుద్ధంలో సైనికులకు సహాయం చేయాలనే విషయం గురించి తనకు చెప్పలేదని చెప్పాడు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలని, ఆ తర్వాత జీతం కూడా పెంచుతామని ఆశ కల్పించారన్నాడు. గత ఏడాది నవంబర్‌లో భారత్‌ను విడిచిపెట్టిన సుఫియాన్ రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేశాడు.

ఈ ఏడాది జూలైలో PTIతో మాట్లాడిన సుఫియాన్ సోదరుడు సల్మాన్, ప్రధాని రష్యా పర్యటన తర్వాత సోదరుడు త్వరగా ఇంటికి తిరిగి వస్తాడని నమ్మకం కలిగిందన్నాడు. ప్రధాని మోదీ తన పర్యటనలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ సమస్యను “చాలా బలంగా” మోదీ లేవనెత్తారు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులను త్వరగా విడుదల చేయాలని భారతదేశం చేసిన డిమాండ్‌ను రష్యా అంగీకరించింది. దీంతో భారతీయులు అనేక మంది యుద్ధభూమిని వదిలి మాతృభూమి చేరుకుంటున్నారు.