‘అమెజాన్’లో ట్రంప్ రికార్డు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ అమెజాన్ బెస్ట్ సెల్లర్ విభాగంలో పోటీ పడుతోంది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అమ్మకాల జోరును కొనసాగించింది. అమెజాన్ ఈ కామర్స్ సైట్లో ‘ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. దీని ధర 92.06 డాలర్లు. అయినా ఎగబడి కొంటున్నారు. ఈ పుస్తకంలో తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడి విశేషాలు, ప్రచారం సమయంలో విశేషాలను ట్రంప్ పొందుపరిచారు. ఈ పుస్తకంలో మార్క్ జుకర్ బర్గ్పై విమర్శలు, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీని సమర్థించుకోవడం వంటి విశేషాలున్నాయి. అమెరికా దేశభక్తులు ఈ చరిత్ర తెలుసుకోవడం అవసరం అని పేర్కొన్నారు.

జూలై నెలలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఒకరు కాల్పులు జరిపిన సంగతిని కూడా ఈ పుస్తకంలో రాశారు. బుల్లెట్ తగిలిన వెంటనే, తేరుకుని ‘ఫైట్’ అంటూ నినాదం చేస్తున్న ఫొటోను ఈ పుస్తకం కవర్ పేజీగా ఉపయోగించారు. మరోసారి అధ్యక్షునిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందిస్తారో ఈ పుస్తకంలో పేర్కొన్నారు. సరిహద్దుల భద్రత, దౌత్యం, పన్నులు వంటి అంశాలు ఈ పుస్తకంలో వివరించారు.

