రైతులకు పరిహారం ఇప్పించే వరకు పోరాడుతాను..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన సర్వే నిర్వహించి, రైతులకు పరిహారం అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. పెనుగంగ నది బ్యాక్ వాటర్ వల్ల బేల మండలంలోని మాంగ్రోడ్, ఖోగ్డుర్, దేవుజీ గూడా తదితర గ్రామాలలో నీట మునిగిన పంట చేన్లను పరిశీలించారు. పంటల పరిస్థితి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేస్తే రైతుల కష్టాలు ఉండేవి కావన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అసలు బీమా పథకం అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. పంటలు నష్టం వల్ల రైతుల బాధలు వర్ణాతీతంగా ఉందని, ఇప్పటికే పంటల కోసం చేసిన అప్పుల్లో ఉన్నారన్నారు. నష్టపోయిన రైతులకు సరిపడా పరిహారం ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబుని కోరడం జరిగిందని తెలిపారు.


