Home Page SliderTelangana

ఇంతకీ బీఆర్ఎస్ విలీనమయ్యేది కాంగ్రెస్‌లోనా, బీజేపీలోనా?

బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారనే చర్చ ఓవైపు, అలాగే కాంగ్రెస్‌లో విలీనమవుతోందన్న చర్చ మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. రెండు ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కానప్పటికీ, రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోస్యం చెపితే, ఇంకేముంది బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనలో ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసేలా స్కెచ్ వేసినట్టుగా కన్పిస్తోంది. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని, కేసీఆర్ ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని ప్రకటించారు. కేటీఆర్‌కు కేంద్రమంత్రి, హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారనున్నారని రేవంత్ జోస్యం చెప్పారు. కాషాయ పార్టీలో గులాబీ పార్టీ విలీనమవుతుందని తాను ముందే చెప్పానని, అది జరుగుతుందనేది రుజువు కాబోతుందన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడిగా, కవిత రాజ్యసభ సభ్యురాలుగా, కేటీఆర్ పీసీసీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్ర్వాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ రాకపోవడానికి, బీజేపీకి సంబంధమేంటని రేవంత్ రెడ్డిని సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, టీ హరీశ్ రావులను ఎందుకు అరెస్ట్ చేయలేదని సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డిని నిలదీశారు. వారిపై చర్యలు తీసుకోకపోవడమే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు చేతులు కలిపి పనిచేస్తున్నాయనడానికి నిదర్శనమన్నారు.

ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ పార్టీ మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మొత్తం ప్రచారం నిరాధారమైనదంటూ తేల్చిపారేశారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో విలీనం ఉండదని, ఆ పార్టీ బలంగా ఉందని, వచ్చే 50 ఏళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో బలంగా ఉంటుందని బీఆర్‌ఎస్ నేత చెప్పారు. BRS నేతలు ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఊహాగానాలు చెలరేగుతాయని, కాంగ్రెస్, BJP రెండూ.. తమ సమస్యలను పక్కనబెట్టి తమపై బురదజల్లుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇతర సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి “విలీనం” ప్రతిపాదనను ఒక బూచిగా చూపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

మొత్తంగా బీఆర్‌ఎస్, బీజేపీ విలీనంపై ఈ చర్చ ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అన్నారు. కవిత దాదాపు ఆరు నెలలుగా జైలులో ఉన్నారని, బెయిల్ వచ్చే సమయంలో BRS బిజెపిలో విలీనమంటూ కాంగ్రెస్ కావాలని దుష్ప్రచారం చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. విలీనం గురించైతే, కవిత అరెస్ట్ అయిన వెంటనే చర్చలు ప్రారంభించి ఉండేది, ఇప్పుడు ఆమె బెయిల్ పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తాము ఎందుకలా చేస్తామని కేటీఆర్ ప్రశ్నించారు. వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తమ సొంత సిద్ధాంతాలతో తమ పార్టీ పరువు తీయడమే బీజేపీ, కాంగ్రెస్‌ల గేమ్‌ ప్లాన్‌ అని బీఆర్‌ఎస్‌ నేతలు అనుమానిస్తున్నారు.