HealthHome Page SliderNational

స్పాట్ జాగింగ్‌తో ఇన్ని ప్రయోజనాలా?

స్పాట్ జాగింగ్ అంటే ఉన్నచోటే ఉండి, పది నిమిషాల పాటు జాగింగ్ చేయాలి. దీనివల్ల గుండె పనితీరు వేగవంతమవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ప్రస్తుత స్పీడ్ పరిస్థితులలో చాలామంది ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడుల కారణంగా వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతున్నారు. కేవలం 10 నిముషాల పాటు ఈ జాగింగ్ చేస్తే చాలా సమస్యలు తీరుతాయంటున్నారు వైద్యులు. మానసిక ఆందోళనను తగ్గించడానికి స్పాట్ జాగింగ్ చాలా ఉపయోగపడుతుంది.

ఈ రకమైన వ్యాయామం వల్ల కండరాలు బలపడతాయి. నీరసం, అలసట, నిస్సత్తువ వంటి లక్షణాలు తగ్గి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

 కేవలం 10 నిమిషాలలో ఈ స్పాట్ జాగింగ్ వల్ల 100 క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనివల్ల శరీర బరువు అదుపులోకి వస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించడానికి కూడా ఈ స్పాట్ జాగింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 ఈ జాగింగ్ వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి. కేవలం 10 నిమిషాల ఈ జాగింగ్ వల్ల రోజంతటికీ శక్తి లభిస్తుంది. ఇతర పనులను కూడా చాలా చురుగ్గా చేయగలుగుతారు.

మధుమేహ రోగులు ఇలా పదినిమిషాలు జాగింగ్ చేస్తే చాలు. రక్తంలోని షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.

పరగడుపున నీరు తాగి ఈ జాగింగ్ చేస్తే చర్మం నిగారింపుతో యవ్వనం సంతరించుకుంటుంది.

ఈ స్పాట్ జాగింగ్ చేయడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. ఇంట్లోనే సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. కేవలం నిలబడడానికి, చేతులు చాపడానికి స్థలం ఉంటే చాలు. ఎంత బిజీగా ఉన్నా 10 నిమిషాల సమయం అందరికీ ఉంటుంది.

ఈ జాగింగ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఉదయాన్నే లేచి జాగింగ్ చేస్తే రాత్రి బాగా నిద్రపడుతుందని ఒక సర్వేలో తేలింది.