Home Page SliderNational

హిమాచల్ హైకోర్టులో ఎంపీ కంగనా రనౌత్‌పై కేసు

మండీ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ హైకోర్టులో కేసు దాఖలు అయ్యింది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నించిన లాయక్ రామ్ నేగి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఎన్నికను రద్దు చేయాలని, తాను వేసిన పిటిషన్‌ను ఏ కారణం లేకుండా తిరస్కరించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ ఆగస్టు 21 వరకూ కంగనాకు సమయం ఇస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది. రామ్ నేగీ అటవీ శాఖలో మాజీ ఉద్యోగి. తాను నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తూ రిటర్నింగ్ అధికారికి నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా సమర్పించానని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరిస్తే ఈ ఎన్నిక చెల్లకపోవచ్చు. ఈ స్థానం నుండి కంగన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు.