ఉద్యోగాలకు వచ్చిన మహిళలకు గర్భనిర్ధారణ పరీక్షలు- చైనాలో కొత్తపోకడ
చైనాలో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టిన మహిళలకు అక్రమంగా గర్భనిర్థారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ పరీక్షలలో పాజిటివ్ వచ్చిన మహిళలను ఉద్యోగాలలో తీసుకోవడానికి సంశయిస్తున్నారు. అసలే జననాల రేటు తగ్గిపోతున్న చైనాలో ఇలా జరగడంతో ప్రభుత్వం పలు కంపెనీలపై దర్యాప్తులు చేపట్టింది. దాదాపు 16 కంపెనీలు ఇలా చేస్తున్నట్లు తెలిసింది. దీనిని వారు ఉద్యోగానికి ముందు ఫిజికల్ టెస్టుగా అభివర్ణిస్తున్నారు. చైనాలో కంపెనీల యాజమాన్యాలు గర్భనిర్థారణ పరీక్షలు నిర్వహించడంపై, వారిపై వివక్ష చూపడంపైనా నిషేధం ఉంది. కొన్ని కంపెనీలు పిల్లలను సాకవలసిన వయస్సులో ఉన్న తల్లులను ఉద్యోగాలలో తీసుకోవడం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ వివరాలు కూడా సేకరిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వాధికారులు కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కూడా తనిఖీలు నిర్వహించింది. వీరికి అధిక జరిమానాలు విధించే అవకాశాలున్నాయి. గత రెండేళ్లుగా చైనాలో జననాలు బాగా తగ్గిపోయాయి. దీనితో ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదమని గ్రహించి ప్రభుత్వాలు 2021 నుండి గతంలో అమలులో ఉన్న సింగిల్ చైల్డ్ పాలసీని తొలగించి ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతించింది.

