జనంలోనే నారా ఫ్యామిలీ!
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో విజయంపై ఒక క్లారిటీతో ఉన్న నారా కుటుంబ సభ్యులు ఇప్పుడు గంపగుత్తగా ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. ఓవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు నారా లోకేష్, నారా భువనేశ్వరి ప్రజల్లో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఎన్నికల ప్రచార హోరు మొదలు పెట్టాలని ముగ్గురు నేతలు భావిస్తున్నారు. ఈనెల ఐదు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించాలని తలపోస్తున్నారు. ఈ సభల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి విజయ ఢంకా మోగించబోతుందన్న భావనను కలిగించాలని యోచిస్తున్నారు.

ఇందుకు తగినట్లుగానే, ఈ సభల్లో ప్రత్యేక ఆకర్షణగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. పవన్ కల్యాణ్ సభల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించి, ప్రజల్లో అనూహ్య స్పందన పొందాలని భావిస్తున్నారు. ఈ సభలను ఒక రేంజ్‌లో హైలైట్ చేసేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి విజయం సాధిస్తే ఏపీలో ఏం జరుగుతుందో వివరిస్తూ.. ఒకవేళ పరిస్థితులు తారుమారైతే ఏం జరుగుతుందో కూడా వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం సినారియోను, ఓటర్లకు వివరిస్తూ… ప్రజల్లో ఒక భరోసా కలిగించాలని చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కనిగిరిలో చంద్రబాబు నాయుడు తొలి బహిరంగ సభను లక్ష మంది సమక్షంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సభలకు భారీగా కార్యకర్తలు హాజరయ్యేలా రెండు పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి.

ఓవైపు చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గం నిత్యం ప్రజల్లోనే ఉండేలా వ్యూహాలు రచిస్తుంటే తనయుడు నారా లోకేష్.. సొంత నియోజకవర్గాన్ని చుట్టేయాలని నిర్ణయించారు. సంక్రాంతి వరకు తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్తూ గడపగడపని తొక్కనున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేయాల్సిందిగా ఆయన మంగళగిరి ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో అనూహ్యంగా ఓటమి పాలైన నారా లోకేష్, ఈసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని దీమాగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అనేకసార్లు చుట్టేసిన లోకేష్, తాజాగా మరోసారి గడపగడపకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మంగళగిరిలో ప్రచారం పూర్తయిన తర్వాత లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గం వర్గాలకు వెళ్లి ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇలా చేయడం ద్వారా పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో సైతం పార్టీకి ఊపు వస్తోందని ఆయన విశ్వసిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టై, జైల్లో ఉన్న సందర్భంగా నిజం గెలవాలని ప్రజల్లోకి వచ్చిన భువనేశ్వరి ఆ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన టీడీపీ సానుభూతిపరుల నివాసాలకు వెళ్లి వారికి పార్టీ అండగా ఉంటుందన్న సందేశం ఇవ్వడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని బలపర్చాలని ఆమె కోరనున్నారు. మూడు రోజులపాటు తాజా యాత్ర కొనసాగనుంది. మొత్తంగా నారా ఫ్యామిలీ అంతా వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జనంలోనే ఉండనుంది.