ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజలు పోటెత్తారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభమైన ఈ కార్యక్రమం, క్రమం తప్పకుండా నిర్వహించబడుతోంది. దివ్యాంగులు, వృద్ధులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తమకు పెన్షన్లు కావాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఆరంభ శూరత్వం కాకుండా దీనిని కొనసాగించడం అభిలషణీయం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ దీనిని విజయవంతం చేస్తున్నారు. వచ్చిన వారికి ఇబ్బందులు కలుగకుండా మంచినీరు ఏర్పాటు చేశారు.

తమ సమస్యలను రాతపూర్వకంగా కూడా ఇవ్వడానికి వీలుగా దరఖాస్తులను తయారు చేశారు. రాయడం రానివారికి సిబ్బంది సహాయం చేస్తూ తమ సమస్యలు స్వయంగా ప్రభుత్వానికి మొరపెట్టుకునే అవకాశం కల్పించడం ఎంతో బాగుందని ప్రజలు అంటున్నారు.

