తెలంగాణ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది-గవర్నర్ తమిళిసై
రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్ర శాసన సభకు నేడు ఉదయం విచ్చేసిన గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర్ రాజన్ కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ లు గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు సాదరంగా తీసుకువెళ్లారు. జాతీయగీతాలాపన అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

పదేళ్ల నిర్బంధపు పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి విజ్ఞతను నేను అభినందిస్తున్నాను. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చావాయువులను పీల్చుకుంటోంది. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందింది. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు ద్వారా చెప్పింది. ఈ తీర్పు పౌరహక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయ్యింది. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగిపోయాయి. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై.. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నాను. -రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్

