తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలలో కొత్త ఆందోళన
పంపకాల్లో సీటు పోతే ఛాన్స్ మిస్
పొత్తులలో భాగంగా రెండు పార్టీలకు కొత్త సవాళ్లు
ఏపీలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగనున్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పొత్తుల్లో భాగంగా కొత్త సవాళ్లు రెండు పార్టీలు ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు సీట్ల కేటాయింపు పోటీపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ ఆశావాహుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. సీటు తమకు కేటాయించాలని కొంతమంది నేతలు తీసుకువస్తున్న ఒత్తిడి రెండు పార్టీలకు కొంత ఇబ్బందికరంగా మారింది. జనసేన ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఆశించే పరిస్థితి ఉన్నట్లుగా వస్తున్న వార్తలతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంత టెన్షన్ మొదలైంది.

ఎవరు స్థానాన్ని కోల్పోతారో తెలియని పరిస్థితి ఉండటంతో టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో నేతలతో పాటు ఉత్తరాంధ్రలో ఈ టెన్షన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు ఎదుర్కొంటున్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో పొత్తులలో భాగంగా పోటీ తీవ్రత ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను కొందరు నేతలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తమ సొంత నివేదికల ఆధారంగా తమ బలాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈసారి ఎలాగైనా బరిలోకి దిగాలన్న బలమైన యోచనలో ఉన్నారు. నేతల ఒత్తిడి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ రెండు పార్టీల అధిష్టానానిదే నిర్ణయం కావడంతో ఆశావహులు తుది ఫలితం ఏ విధంగా ఉంటుందో ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న అవగాహన ఒప్పందం ప్రకారం జనసేన పార్టీకి దాదాపుగా 30 స్థానాల వరకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇవి కాక మరికొన్ని చోట్ల అవకాశం కల్పించాలని ఆ పార్టీ నేతలు అధినాయకత్వంపై కొంత ఒత్తిడి తీసుకువస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన కేడర్ ఉందని సీటు కేటాయిస్తే గెలుపు తధ్యమని అధినాయకత్వం వద్ద వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒప్పందంలో భాగంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని అగ్రనాయకత్వం నేతలకు సర్ది చెబుతున్నప్పటికీ వారు మాత్రం తమ ప్రయత్నాలను మానుకొని పరిస్థితి ఉంది. ఈసారి ఎన్నికల్లో మంచి పట్టు ఉన్న స్థానాల్లో పోటీ చేసి ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో బలం నిరూపించుకునే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలోని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు కూడా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్ప మార్పుల మినహా కొత్త ప్రయోగాలను డిమాండ్లను చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా లేరన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో కూడా పార్టీ ప్రాబల్యాన్ని నిలిపేందుకు పవన్, తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇరు పార్టీలలో కొంత మంది నేతలు తమకు సీటు వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు.

