Home Page SliderNational

రైల్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ ప్రమాదం..తొమ్మిదిమంది మృతి

తమిళనాడులోని మధురైలో రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నేడు(శనివారం) తెల్లవారుజామున ఐదున్నరగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో రైల్లోకి అక్రమంగా గ్యాస్ సిలిండర్‌ను తెచ్చి దానిపై ‘టీ’ని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు వివరించారు. ఈ కోచ్ ఆగస్టు 17 నాడు ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించగా, శుక్రవారం నాగర్ కోయిల్ జంక్షన్ వద్ద దీనిని పునలూరు-మధురై రైలుకు అటాచ్ చేశారు. దీనిని రాత్రి మదురై రైల్వేస్టేషన్ వద్ద డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైనులో పెట్టారు. ఈ కోచ్‌లోకి ప్రయాణికులలో ఒకరు అక్రమంగా గ్యాస్ సిలిండర్‌ను తెచ్చి, టీ తయారు చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది, ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ బోగీలో 65 మంది ఉండగా, 9 మంది మంటల్లో కాలి, అక్కడికక్కడే మృతిచెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగిలినవారు వెంటనే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై రైల్వేశాఖ ఉలిక్కిపడింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడ మృతుల కుటుంబాలకు 3లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.