సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జీతంలో భారీ కోత విధించిన ఆ దేశ ప్రధాని
అవినీతి విచారణ నేపథ్యంలో సింగపూర్ ప్రధాని కీలక నిర్ణయం
భారతీయ సంతతికి మంత్రి ఈశ్వరన్ వేతనంలో 82 శాతం కోత
అక్రమాస్తుల విచారణకు సంబంధించి గత నెలలో అరెస్టు చేసిన తర్వాత సింగపూర్ మంత్రి ఎస్. ఈశ్వరన్ జీతాన్ని భారీగా తగ్గించినట్టు సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ పార్లమెంట్‌లో చెప్పారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈశ్వరన్ జీతం నెలకు $8,500 సింగపూర్ డాలర్లకు తగ్గించినట్టు ప్రధాని చెప్పారు. ఇండియా కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 5 లక్షల 20 వేలుగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమంగా వేతనం పొందేవారిలో సింగపూర్‌లో రాజకీయ నాయకులు ఉన్నారు. సింగపూర్‌లో మంత్రి బేస్ జీతం 46,750 సింగపూర్ డాలర్లుగా ఉండగా భారతీయ కరెన్సీలో ఆ మొత్తం సుమారుగా 29 లక్షలు. ప్రస్తుతం ఈశ్వరన్ జీతాన్ని బేస్ శాలరీలో 82% తగ్గించారు. బుధవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, అక్రమాస్తుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ కేసుపై మరిన్ని వివరాలను తెలియాల్సి ఉందన్నారు. మంత్రుల ప్రమేయం ఉన్న ఇటువంటి సంఘటనలు సింగపూర్‌లో చాలా అరుదు. ఇటీవలి సంఘటనలు, స్వచ్ఛమైన పాలన అందించే సింగపూర్ ప్రభుత్వానికి మాయమని మచ్చగా నిలిచాయన్నారు ప్రధాని లీ.

