సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే ఇకపై “స్మాష్”
ఇటీవల కాలంలో సోషల్ మీడియాను వినియోగించేవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొందరు సమాజంలో అల్లర్లును సృష్టించడానికి సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. కాగా సోషల్ మీడియాలో అభ్యంతరకర,ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే “ది సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్”(స్మాష్) పేరుతో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చారు. దీని ద్వారా మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ఇద్దరిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపారు. అంతేకాకుండా ఇలాంటి పోస్టులు పెడుతున్న మరో 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతేడాది కూడా అభ్యతరకరంగా ఉన్న 1,16,431 పోస్టులను విశ్లేషించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

