అర్థరాత్రి ట్రక్కులో ఒంటరిగా రాహుల్ ప్రయాణం
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పెద్ద సాహసమే చేశారు. సెక్యూరిటీ లేకుండా రాత్రిపూట ఒంటరిగా హరియాణాలోని అంబాలా నుండి చండీగఢ్ వరకు 50 కిలోమీటర్లు ట్రక్కులో ప్రయాణం చేశారు. అనంతరం తన వాహనంలో సిమ్లాకు బయలుదేరారు. నిజానికి సిమ్లాలోని తన తల్లి సోనియాను కలవడానికి బయలుదేరిన రాహుల్ మార్గమధ్యలో అంబాలా వద్ద ట్రక్కులు నిలిపి ఉండడంతో వాహనాన్ని ఆపి వారితో ముచ్చట్లు మొదలు పెట్టారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక ట్రక్కు ఎక్కి చండీగఢ్ వరకు వెళ్లారు. ఇటీవలే లక్నోలో రాహుల్‌ను హత్యచేస్తామంటూ బెదిరింపులు వచ్చిన సందర్భంలో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. ఇలాంటి సమయంలో రాహుల్ ఇలా ధైర్యంగా లారీలో ప్రయాణం చేయడం సాహసమనే చెప్పాలి. ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విటర్లో పోస్టు చేశారు. గతంలో దేశమంతా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో ఇలాగే చాలామంది సామాన్యుల కష్టసుఖాలు తెలుసుకున్నారు రాహుల్. ఇటీవల కర్ణాటక ప్రచారంలో భాగంగా ఒకరి బైక్‌పై ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

