వైయస్సార్సీపీ సర్కారుపై నిప్పులు చెరిగిన బీజెేపి నేతలు
వైయస్సార్సీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు కబ్జాలు వ్యవస్థీకృతమైనట్లు ఆరోపించారు. ప్రకృతి సంపద, దోపిడీ, సంక్షేమ పథకాల పేరిట పన్నుల మోత అభివృద్ధి శూన్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వైయస్సార్సీపీ చీడ పట్టిందన్న నేతలు ఇదే పరిస్థితి కొనసాగితే సోమాలియా, సోడాన్, శ్రీలంక పాకిస్తాన్ పరిస్థితిలే నెలకొంటాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ దశలోని బీఆర్ఎస్ను ఏపీలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగింది.

రాష్ట్ర ప్రజలను వైయస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా వంచిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రారంభ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అరాచక పాలన అవినీతి అక్రమాలపై చార్జిషీటు ఉద్యమాన్ని చేపట్టామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తల్లి పిల్లల పార్టీలు దోపిడీకి పాల్పడుతున్నాయని వీఆర్ఎస్ తీసుకోవాల్సిన దశలో బీఆర్ఎస్ ఏపీలో కార్యాలయం పెట్టడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని గట్టిగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ సహ సంఘటన మంత్రి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, కార్యదర్శి సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర బీజేపీ ప్రముఖులు, పదాధికారులు అనుబంధ విభాగాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇన్చార్జిలు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొని ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

