పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. సబ్సిడిని తగ్గించనున్న కేంద్రం
పెట్రోల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌లు ఎక్కువగా తిరుగుతున్నాయి. వినియోగదారులకు ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు ఎంపికలు మునుపటి కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్రం షాక్ నిచ్చింది. ఒక్కో యూనిట్ విక్రయ ధరలో ప్రస్తుతం 40 శాతం సబ్సిడీని కేంద్ర సర్కార్ ఇస్తోంది. ఈ స్కీము గడువు 2024 మార్చితో ముగియనుంది. అయితే.. ఈ సబ్సిడీని 15 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర సర్కార్ కొత్త ప్రతిపాదన. 15 శాతానికి సబ్సిడీ తగ్గించడంతో విపరీతంగా ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ స్కీము యొక్క గడువును పొడిగించాలని వాహన పరిశ్రమ ఇప్పటికే కేంద్ర సర్కారును కోరింది. దాని వల్ల దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, పర్యావరణ కాలుష్యం తగ్గించాలన్న లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుందని పరిశ్రమ తన అభిప్రాయాలను బలంగా కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లింది.
ఇప్పటి వరకు ఈ స్కీము కింద మొత్తం 5.63 లక్షల ఎలక్ట్రిక్ బైక్‌లు సబ్సీడీ ప్రయోజనం పొందాయి. 2024 మార్చి నాటికి మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ బైక్‌లకు సబ్సిడీ అందించాలన్నది లక్ష్యం. ప్రతి నెలా సుమారు 45 వేల యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రస్తుతం అమ్ముడుపోతున్నాయి.