Home Page SliderInternational

కొత్త ఇంట్లో గుట్టలుగా పాముల సంచారం

పాపం కొత్త ఇంట్లో చేరిన సంతోషం అంతలోనే ఆవిరయ్యింది. ఇంట్లోనుండి పుట్టలో నుండి వచ్చినట్లు ఒక్కొక్కపాము బయటకు రాసాగింది. అమెరికాలోని కొలరాడోలో ఉండే అంబర్ హాల్ అనే మహిళకు ఇద్దరు పిల్లలు. ఒంటరిగా పిల్లలను కష్టపడి పెంచుకుంటోంది. సొంత ఇల్లు కొనాలని, పదేళ్లుగా సొమ్ము పొదుపు చేసుకుంటూ వస్తోంది. చివరికి ఈ ఏప్రిల్‌లో ఒక ఇల్లు దొరికింది. నాలుగు బెడ్‌రూంలతో, చిన్న లాన్‌తో ఉండే ఆ ఇల్లును డబ్బంతా చెల్లించి సొంతం చేసుకుంది. ఇంటిలో తన పెంపుడు కుక్కలతో పాటు అడుగుపెట్టింది.

కుక్కలు అదేపనిగా మొరగడంతో పరీక్షించి చూడగా పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే మరికొన్ని పాములు కనిపించసాగాయి. చిన్న చిన్న పాములు, పెద్దపాములు అల్మారాలో, గోడసందుల్లో, సీలింగ్‌ వంపుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిచ్చాయి. దీనితో హడలిపోయిన ఆమె స్నేక్ క్యాచర్స్‌ను పిలువగా, 40 పాములు పట్టుకున్నారు. ఇల్లు వదిలి వెళ్లే స్తోమత లేని ఆమె తప్పక అదే ఇంట్లో ఉండసాగింది. కానీ ఇంకా పాములు వస్తూనే ఉన్నాయిట. గతంలో ఈ ఇంటికింద మడుగు ఉండేదని, దానికి కాంక్రీట్ స్లాబ్ వేయగలిగితే పాముల బెడద తప్పుతుందని అంబర్ తనకు సహాయం చేసేవారి కోసం ఎదురుచూస్తోంది.