Andhra PradeshHome Page Slider

జగన్ బుజ్జగింపు, ఐనా అలక వీడని బాలినేని

  • మంత్రివర్గంలో చోటు దక్కనప్పటి నుండి పార్టీపై అసంతృప్తి
  • తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా
  • క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్న సీఎం జగన్
  • 45 నిమిషాలు చర్చలు జరిగిన మెట్టు దిగని బాలినేని

ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మంచి పట్టు ఉన్న నేత ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీపై అసంతృప్తితో ఉన్నారు. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనను తప్పించి అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను మంత్రివర్గంలో కొనసాగించడంపై అప్పటి నుండి పార్టీపై రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్త పదవికి కూడా ఆయన రాజీనామా చేయటంతో దీనిపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి జగన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించేందుకు మంగళవారం క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపుగా 40 నిమిషాలు చర్చలు జరిగాయి.

ఏడాదిలో ఎన్నికలకు వెళ్తున్నామని ఆధిపత్య పోరుకు స్వస్తి చెప్పాలని ఏమైనా అభిప్రాయభేదాలు ఉంటే పార్టీ వేదికగా చర్చించుకుందామని ఏమైనా పనులు ఉంటే నేను చూసుకుంటానని ముఖ్యమంత్రి జగన్, బాలినేనికి సూచించిన కూడా ఆయన ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలో తనకు ఎదురవుతున్న పరిణామాలు అన్నిటిని బాలినేని జగన్‌కు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల సీఎం జగన్ మార్కాపురం పర్యటన సందర్భంగా ఎదురైన పరాభవం అలాగే డీఎస్పీల బదిలీల విషయంలో తాను సూచించిన పేరు లేకపోవడం అలాంటి ఎన్నో కారణాలను సీఎం జగన్ కు బాలినేని తెలిపారని తెలుస్తోంది. తన మాటకు విలువ లేకపోవడం పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడానికి దారి తీసిన కారణాలను కూడా జగన్‌కు వివరించారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలిచి వేస్తున్నాయని అధికారులు బదిలీలలో జోక్యం చేసుకునే పరిస్థితి కూడా లేదని మంత్రి పదవి నుండి పక్కన పెట్టిన సొంత జిల్లా నుంచి తప్పించి వేరే జిల్లాలకు సమన్వయకర్తగా నియమించినా, తాను బాధ్యతల నుండి ఎప్పుడు తప్పుకోలేదని సీఎం వద్ద బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ కల్పించుకొని బాలినేనికి నచ్చ చెప్పారని తన మాట వినాలని ఏం కావాలో నేను చూసుకుంటా అని జగన్ భరోసా ఇచ్చారని, అయినా బాలినేని అలకవేడలేదని అంటున్నారు. సీఎంతో చర్చల అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా హైదరాబాద్ నివాసానికి బాలినేని వెళ్లిపోయారు.