Andhra PradeshHome Page Slider

సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారు: ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సోమవారం మధ్యాహ్నం సిబిఐ విచారణకు హాజరు కావలసిన ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ లో కీలక వివరాలు పేర్కొన్నారు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టుపై తమకు నమ్మకం ఉందని న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారని తన స్టేట్మెంట్ రికార్డు చేశారని కోర్టుకు తెలిపారు. వివేకానంద రెడ్డి కూతురు సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు సీబీఐ ఆఫీసర్ కుమ్మక్కయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్రోవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలంతో తనను ఈ కేసులో కుట్రపన్ని ఇరికిస్తున్నారని వివరించారు. దస్తగిరిని న్యూ ఢిల్లీకి పిలిపించి చాలా రోజులు పాటు సిబిఐ తన దగ్గర ఉంచుకుందని అక్కడే అతడిని అప్రూవల్‌గా మార్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో తనపై అభియోగాలు మోపేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రామాణికంగా సీబీఐ తీసుకుందని అన్నారు. హత్య జరిగిన ఈ నాలుగేళ్ల నుంచి తనను చాలా సార్లు టార్గెట్ చేశారని ఇప్పుడు నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే యోచనలో సీబీఐ ఉందని వివరించారు. ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ అరెస్టు చేసినా, బెయిల్ పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.