Home Page SliderNews AlertTelangana

సిట్‌పై నాకు నమ్మకం లేదు.. ఎలాంటి సమాచారం ఇవ్వను..

TSPSC పేపర్‌ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ లేఖ రాశారు. సిట్‌ను తాను విశ్వసించడం లేదని.. సిట్‌పై తనకు నమ్మకం లేదన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదని స్పష్టం చేశారు. నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన దగ్గరున్న వివరాలను అందిస్తానని బండి సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బండి డిమాండ్‌ చేశారు. మరోవైపు సిట్‌ నోటీసులు తనకు అందలేదన్నారు. 24వ తేదీన హాజరుకావాలని సిట్‌ కోరినట్లు నాకు మీడియా ద్వారా తెలిసిందన్నారు. మీడియాలో వచ్చిన సమాచారం మేరకే తాను సిట్‌ నోటీసులపై స్పందిస్తూన్నానని చెప్పారు. పార్లమెంట్‌ సభ్యునిగా తాను సభకు హాజరు కావాల్సి ఉందన్నారు. తాను ఖచ్చితంగా హాజరు కావాలని భావిస్తే.. మరో తేదీ చెబితే తాను తప్పకుండా హాజరవుతానని లేఖలో బండి సంజయ్‌ కోరారు.

పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా బండి సంజయ్‌ ఢిల్లీలో ఉన్నారు. అయితే నేడు బండి సంజయ్‌ సిట్‌ ముందు హాజరు కావాల్సి ఉంది. సిట్‌కు లేఖ రాయడంతో బండి ఇవాళ విచారణకు దూరం కానున్నారని తెలుస్తోంది. బండి హాజరుకాకపోతే సిట్‌ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. మరో తేదీ రావాల్సిందిగా బండికి నోటీసులు ఇస్తుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.