Home Page SliderNational

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… 4 రాష్ట్రాలకు కొత్త బీజేపీ చీఫ్‌లు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చి బీజేపీ అధినాయకత్వం. రాజస్థాన్‌, ఢిల్లీ, బీహార్, ఒడిశాలో ఈసారి తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న ఆ పార్టీ కొత్త అధ్యక్షుల నియామకాల తర్వాత దూకుడు పెంచాలని భావిస్తోంది. రాజస్థాన్‌ లోక్‌సభ ఎంపీ సీపీ జోషి, బీహార్‌ ఓబీసీ నేత, ఎమ్మెల్సీ సామ్రాట్ చౌదరితో సహా నలుగురు కొత్త రాష్ట్ర అధ్యక్షులను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ నియమించారు. మాజీ మంత్రి మన్మోహన్ సమల్‌ను పార్టీ ఒడిశా విభాగానికి అధిపతిగా నియమించారు. ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవాను బీజేపీ చీఫ్‌గా ఎంపిక చేశారు.

బీహార్‌లో పార్టీ ఇప్పుడున్న సంక్షోభ నివారణకు ఎలా అడుగులు వేయాలన్నదానిపై పార్టీ ముఖ్యులు కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నారు. ఎన్డీఏకు నితీష్ కుమార్ గుడ్ బై చెప్పాక… రాష్ట్రంలో పార్టీని ఎలా నిలబెట్టాలన్నదానిపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారు. 2018లో పార్టీలో చేరిన తర్వాత సామ్రాట్ చౌదరి క్రమంగా బీజేపీలో ఎదిగారు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పార్టీ నాయకుడు, ముఖ్యమైన కుష్వాహా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. లోక్‌సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ బీజేపీ చీఫ్‌గా చౌదరి సారథ్యం వహిస్తారు.

రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా జైపూర్‌లోని అంబర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయిన సతీష్ పూనియా స్థానంలో కొత్తగా… సీపీ జోషికి బాధ్యతలు అప్పగించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జోషి చిత్తోర్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు గులాబ్ చంద్ కటారియా అసోం గవర్నర్‌గా నియమించాక… పూనియాను తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. రాజస్థాన్ రాజకీయాల్లో కటారియా, పూనియా ప్రజల్లో మంచి పలుకుబడి సంపాదించారు. అంతే కాకుండా ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. కటారియా మాదిరిగా పూనియాకు కూడా రాజస్థాన్‌లో పుట్టున్నప్పటికీ… మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో సఖ్యత లేకపోవడం కూడా తాజా మార్పునకు కారణంగా తెలుస్తోంది. పార్టీ కేంద్ర నాయకత్వం ఒప్పించి తాను అనుకున్న విధంగా వసుంధర వ్యవహరిస్తున్నారు.

మాజీ మంత్రి సమాల్‌ను ఒడిశా బీజేపీ చీఫ్‌గా పార్టీ ప్రకటించింది. ఒడిశా బీజేపీ ముఖ్యులలో సమాల్ ఒకరు. గతంలో పార్టీ చీఫ్‌గా వ్యవహరించిన సమీర్ మొహంతి కంటే.. పార్టీని ఉన్నతంగా నిలపాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారు. దూకుడుతత్వం… ప్రత్యేకమైన హిందూత్వ ముద్రను ప్రజల్లో తీసుకెళ్లడంలో సమాల్‌ది అందివేసిన చేయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒడిశాలో బీజేపీ ఎదుగుదలకు తాజా నియామకం దోహదపడుతుందని పార్టీ భావిస్తోంది. సమాల్ గతంలో కూడా రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహించారు.

బీజేపీ ఢిల్లీ చీఫ్‌గా…. అధికారం నుంచి ఆదేశ్ గుప్తాను తొలగించిన తర్వాత పార్టీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కొద్ది కాలంలోనే సచ్‌దేవా ఆకట్టుకున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. వివాదరహితుడు కావడం, పార్టీలో మొదట్నుంచి ఉన్న వ్యక్తిగా ఆయనకు ఢిల్లీ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవీకాలం ముగియడంతోనే మార్పులు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.