వరుసగా ఐదోసారి అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ప్రశ్నోత్తరాల సమయంలో, టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం
సీఎం వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యులు, నేతలపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం 11 మంది సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన సభ్యుల సస్పెన్షన్ ప్రతిపాదించారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగుపూడి, మంతెన రామరాజు, సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ, గద్దె రామ్మోహన్ ఉన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో, టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే టీడీపీ సభ్యుల ప్రతిపాదన అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన పేర్కొంటూ.. సభ వృథా అవుతోందన్నారు. అంతకుముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై చర్చించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.


