మారిన వాతావరణం.. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. గురువారం నుండి వరుసగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కుస్తారని పేర్కొంది. ఇదే సమయంలో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.. ఈ సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి కొత్త రికార్డులు సృష్టించాయి. భారీ వర్షాలు నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

