Andhra PradeshHome Page Slider

9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. మార్చి 16న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు బీఏసీ సమావేశం ఆమోదం తెలిపింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, జోగి రమేష్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

కాగా, ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో విశేష ప్రగతి సాధిస్తోందని గవర్నర్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తోందని, వినూత్నంగా అమలు చేస్తున్న వాలంటీర్‌ వ్యవస్థను గవర్నర్‌ కొనియాడారు.