Home Page SliderNational

కాంగ్రెస్ ఇకపై ఎంత మాత్రం జాతీయ పార్టీ కాదు- ఎమ్మెల్సీ కవిత

దేశంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ జట్టులో భాగంగా ఉండాలని, ప్రాంతీయ శక్తులతో జతకట్టాలని భారత రాష్ట్ర సమితి, బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత అన్నారు. కాంగ్రెస్ ఇకపై జాతీయ పార్టీ కాదని, అహంకారాన్ని విడిచిపెట్టి, వాస్తవికతకు దగ్గరగా మసలుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు కవిత శనివారం హాజరుకానున్నారు. ఢిల్లీలో రద్దు చేసిన లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కిక్‌బ్యాక్‌ల ద్వారా లబ్ది పొందిన “సౌత్ గ్రూప్ల్”లో కవిత భాగమని ED ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఆరోపణలను కవిత ఖండించారు. రాజకీయ లక్ష్యాల కోసం కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆమె విమర్శించారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం తన ఏజెన్సీలను రాష్ట్రానికి పంపుతోందని కవిత దుయ్యబట్టారు. తెలంగాణలో ఎన్నికల సంవత్సరం కావడంతో దర్యాప్తు సంస్థల దాడులు పెరిగాయన్నారు. ఆదాయపు పన్ను శాఖ 500 సార్లు, సీబీఐ 100 సార్లు, ఈడీ 200 సార్లు దాడులు నిర్వహించాయన్నారు. ఒక మహిళను కేంద్ర నిఘా సంస్థలు విచారించాల్సి వస్తే, చట్ట ప్రకారం, ఇంటి వద్ద ప్రశ్నించడానికి “ప్రాథమిక హక్కు” కూడా ఉందని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో నిరాహారదీక్ష గురించి తాము… మార్చి 2నే పోస్టర్‌ను విడుదల చేసామన్నారు కవిత. పద్దెనిమిది పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు. ఐతే మార్చి 9న ఈడీ పిలిచిందన్నారు. తాను మార్చి 16న హాజరవుతానని అభ్యర్థించినా… వారు ఎందుకో తొందరపడుతున్నారన్నారు. మార్చి 11న విచారణకు హాజరయ్యేందుకు ఆమోదం చెప్పానన్నారు. విచారించడానికి మార్చి 11న ఇంటికి రావాలని EDని అభ్యర్థించినా… వారు తమ వద్దకే రమ్మన్నారని కవిత తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు ఒత్తిడి తెస్తామని చెప్పారు. 27 ఏళ్ల తర్వాత కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చిస్తున్నామని కవిత అన్నారు.

లోక్‌సభ, అసెంబ్లీలలో 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయడానికి రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే చట్టం, 1996లో హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వంచే మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. అయితే కొన్ని అభ్యంతరాల కారణంగా నిలిపివేయబడింది. UPA హయాంలో 2018లో శాసనసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అయితే, లోక్‌సభ దానిపై ఎన్నడూ ఓటు చేయలేదు. చివరికి బిల్లు అమలుకు నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి సోనియా గాంధీ చొరవ చూపినందుకు… దేశంలోని మహిళలందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నానన్నారు కవిత. సోనియా కృషి వల్లే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందన్నారు.