Home Page SliderNational

కర్నాటక ఓటర్లకు ఆఫర్లు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లు, తిరుమల టూర్లు…

త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు
బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
మరోసారి గెలవాలని బీజేపీ ఎత్తులు
గెలుపుపై కర్నాటక కాంగ్రెస్ విశ్వాసం
ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు
డిన్నర్ సెట్లు, మిక్సీలు, కుక్కర్లు
ఎల్ఐసీ ప్రీమియమ్‌లు చెల్లింపు
తిరుమలతో సహా తీర్థయాత్రలకు ఏర్పాట్లు
నోటిఫికేషన్ రాక ముందే పంపిణీ షురూ

ఎన్నికలతో పాటు ఉచితాలు వస్తున్నాయి. ఈ ఏడాది అత్యంత కీలకమైన ఎన్నికలలో ఒకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల నిబంధనలు రాకపోవడంతో రాష్ట్రంలోని పలువురు నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. భారత ఎన్నికల సంఘం (ECI) ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఇంకా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోలోకి రాలేదు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉచితంగా కుక్కర్లను పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డిన్నర్ సెట్లు, డిజిటల్ క్లాక్‌లు, ఇతర బహుమతులు కూడా అందిస్తున్నారు. మరికొందరు రాజకీయ నాయకులు ఓటర్లకు తీర్థయాత్రలు స్పాన్సర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని షిర్డీ, కర్ణాటకలోని ధర్మశాలలోని మంజునాథ స్వామి దేవాలయాలకు తీసుకెళ్లేందుకు కూడా అభ్యర్థులు సై అంటున్నారట.

బెంగళూరులోని ఒక నియోజకవర్గంలో ఓటర్లకు డిన్నర్ సెట్లు పంపిణీ చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదించింది. డిన్నర్ సెట్‌ తీసుకోడానికి కాల్ వచ్చిందంటూ.. అది అందుకోడానికి వచ్చిన మహిళ చెప్పారు. ఇదంతా బోగస్ అని మొదట తాను అనుకున్నానని… కానీ నిజమో, కాదో చెక్ చేసేందుకు వెళ్లినప్పుడు నిజంగా డిన్నర్ సెట్లను పంపిణీ చేయడాన్ని చూశానంది. బెంగళూరులోని మరో సెగ్మెంట్‌లో, కొంత మంది అభ్యర్థులు ఓటర్లలో ఒక వర్గానికి జీవిత బీమా ప్రీమియం చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు అప్రమత్తమై ట్రక్కుల కొద్దీ ప్రెషర్ కుక్కర్లు, వంటగది పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా పీటీఐకి తెలిపారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే ఇటువంటి పద్ధతులను అరికట్టడానికి మార్గాలు కూడా ఉన్నాయన్నారు.

ఎన్నికల తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఎలా వ్యవరించాలన్నదానిపై ఆలోచిస్తున్నట్టు ఈసీ మీనా చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సమావేశాన్ని పిలిచి, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. అధికారులు చట్టాన్ని ఉపయోగించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ గోడౌన్లపై దాడి చేసి, GST చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే గుర్తించవచ్చని ఈసీ చెప్పారు. చిక్ మంగుళూరు, తుమకూరులోని రెండు గోదాములపై ​​కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ దాడులు నిర్వహించగా ఆ సరుకులకు ఎలాంటి బిల్లులు లేవని సీఈవో మీనా చెప్పారు. దీని ప్రకారం వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.

భారతదేశంలో, రాజకీయ నాయకులు ఓటర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు పంచడమన్నది కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. వీటిలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, నగదు, ఆహారం ఉన్నాయి. ఇలాంటివి చేయడం ద్వారా ఓటరుకు లంచం ఇవ్వడమేనని… ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వీర్యం చేయడమేనని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పద్ధతులను అరికట్టడానికి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయని… ఐతే అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోడానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయన్న వర్షన్ కూడా బలంగా విన్పిస్తోంది.