Home Page SliderTelangana

జగిత్యాల ఎమ్మెల్యే వేధింపులు? ఛైర్‌పర్సన్ రాజీనామా

బీసీలంటే అలుసా దొరా అంటూ శ్రావణి కన్నీరు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగడాలు?
మీడియా ముందు కంటతడి పెట్టిన బోగ శ్రావణి
చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్నానంటూ గళం విప్పారు. ఎమ్మెల్యే నలుగురు ముందు తిట్టినా భరించానని… ఓపిక నశించిందని… ఎమ్మెల్యే తిట్లను ఇక భరించలేనన్నారు. ఎమ్మెల్యే టార్చర్ భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నాన్నారు. దొర గారు మీకో దండం అంటూ మీడియా ముందు బోగ శ్రావణి కన్నీటిపర్యంతమయ్యారు. పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చిన చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇదో చీకటి రోజుగా అభివర్ణించిన శ్రావణి… డాక్టర్ సంజయ్ కుమార్ దొర మీకో దండమంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.
బహుజనుల గళమెత్తిన గడ్డ సాక్షిగా బీసీ మహిళ అణచివేతకు గురయ్యిందన్నారు. పోరాడితే పోయేదేం ఉంది బానిస సంకెళ్లు తప్ప.. దొర నీ గడిలోంచి ఇవాళ బయటపడ్డానన్నారు. శుభాకాంక్షలు.. మీరే గెలిచారు… బీసీలు ఉన్నతపదవులకు పనికిరారంటూ శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు.

మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేకసార్లు బెదిరిస్తున్నాడంటూ బోగ శ్రావణి వాపోయారు. డబ్బులు కోసం డిమాండ్ చేసారని… ఇవ్వలేమంటే కక్షగట్టారన్నారు. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేకపోతున్నారన్నారు. అన్ని పనులకు అడ్డొస్తున్నారని విమర్శించారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేసారని విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ కవితను కలవొద్దని… కేటీర్ పేరు ప్రస్తావించొద్దని హుకుం జారీ చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఎమ్మెల్యే తో ప్రాణహాని ఉందన్నారు. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళానన్నారు శ్రావణి. ఎమ్మెల్యే తో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానించారన్నారు. అవిశ్వాసం ఎమ్మెల్యే ఆడిన డ్రామా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.