సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగకు అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. అయితే.. ప్రయాణికుల కోసం ఓ బంరాఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ (రాను, పోను) బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. సంక్రాంతికి ఊరు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. ప్రత్యేక బస్సుల్లోనూ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. వెబ్సైట్, యాప్, టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. జనవరి 6 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు ఆర్టీసీ నడపనుంది.
సంక్రాంతికి నడిపే స్పెషల్ బస్సు సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతోపాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు నడవనున్నాయి. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. గతంలో పండగలకు నడిపే ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీ అదనంగా తీసుకునేవారు. కానీ ఆర్టీసీ ఈ సారి అలాంటి ప్రయోగాలకు గుడ్‌బై చెప్పింది. దసరాకు తొలిసారి ప్రయోగాత్మకంగా ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతో నడిపారు. ఈ నిర్ణయంతో దసరా సీజన్లో ఆర్టీసీకి భారీగానే ఆదాయం సమకూరింది. ఇప్పుడు సంక్రాంతికి కూడా అదే ఫార్ములాను ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల కోసం డిజిటల్ చెల్లింపుల్ని ప్రారంభించింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించి టికెట్లను పొందవచ్చు.

