ఈ నెల 30న యాదాద్రి వెళ్లనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదాద్రికి రానున్నారు. ఈ నెల 30న యాదగిరిగుట్ట నరసింహాస్వామిని దర్శించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా… రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ద్రౌపది ముర్ము ఈఎంఈ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ ఎం17 హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట దేవస్థానం వద్ద హెలిప్యాడ్ స్థలానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక వాహనంలో కొండపైకి చేరుకుంటారు. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ద్రౌపదీ ముర్ము యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. 15 మంది రాష్ట్రపతుల్లో ఇప్పటి వరకు నలుగురు మాత్రమే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా ద్రౌపదీ ముర్ము స్వామివారిని దర్శించుకోనున్న ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు.