ఓటర్లకు క్లారిటీ ఇస్తున్న చంద్రబాబు
◆ ఏపీ ప్రజలకు జగన్ నమ్మకద్రోహం
◆ జాబ్ క్యాలెండర్ లేదు ఉద్యోగాలు లేవు
◆ విధ్వంసం సులభం అభివృద్ధి చాలా కష్టం
◆ జగన్ పై విరుచుకుపడిన చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. స్వార్థ ప్రయోజనాలు ఆశించి రాజకీయం చేస్తే ఉపేక్షించేది లేదని తనకు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం విజయనగరం కోట కూడలి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విధ్వంసం చేయటం సులభం కానీ అభివృద్ధి చేయటం చాలా కష్టమని జగన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.

జగన్ ఏపీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని మాట తప్పను మడం తిప్పను అని ప్రగల్బాలు పలికి మద్యపానాన్ని నిషేదించలేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఉద్యోగాలు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రాన్ని తగలపెట్టిన జగన్ పొట్ట పగలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. చెత్త పై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని నవరత్నాల పేరిట జగన్ నవ మోసాలు చేస్తున్నాడన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధికి సంబంధించి ఒక పునాదిరాయి కూడా వేయలేని జగన్ ఏకంగా విశాఖను రాజధాని చేస్తానంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. విశాఖను గంజాయి రాజధానిగా మాత్రం మార్చగలిగాడని ఎద్దేవా చేశారు.

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న జగన్ తన పదవిక వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ పై కూడా చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఎక్కడున్నావు నీకు పౌరుషం అన్నదే లేదా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బొత్స కుటుంబం జిల్లాను దోచుకుంటుందని ఆరోపించిన చంద్రబాబు సెంటు భూమి కనిపించిన హాంఫట్ చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా చురకలంటించారు. చంద్రబాబు విజయనగరం పర్యటనలో భాగంగా సభలకు జనాలు భారీగా తరలివచ్చారు. ఆ జన సందోహాన్ని చూసిన చంద్రబాబు నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అంటూ సంబరపడిపోయారు.

