నేటి నుంచి జీ-20 కూటమికి భారత్ నేతృత్వం
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమి అయిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం స్వీకరించింది. దీంతో అగ్రరాజ్యాలకు దీటుగా బలమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్న భారత్‌కు విశిష్ట ఘనత దక్కినట్లు అయింది. అధ్యక్ష బాధ్యతను భారత్ డిసెంబరు ఒకటో తేదీ నుంచి నిర్వహిస్తుందని ఇండోనేషియాలోని బాలీలో ఇటీవల జరిగిన జీ-20 సమావేశాల్లో ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై దేశంలోని 32 ప్రాంతాల్లో 200 సమావేశాలు నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా తయారు చేసిన ప్రత్యేక లోగోను దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ప్రదర్శిస్తారు.

వచ్చే ఏడాది జీ-20 సమావేశాలు భారత్‌లోనే..
ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో సవాళ్లు ఉన్న సమయంలో జీ-20 కూటమికి నేతృత్వం వహించే అవకాశం లభించిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2023 సెప్టెంబరులో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. జీ-20లో భారత్‌తో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, అమెరికా, బ్రిటన్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాలదే 85 శాతం వాటా ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, జనాభాలో మూడింట రెండొంతులు జీ-20 దేశాల్లోనే ఉన్నారు.