మరో ఉప ఎన్నికకు బీజేపీ ప్లాన్..!
మునుగోడులో టీఆర్‌ఎస్‌కు కళ్లు బైర్లు కమ్మే రీతిలో గట్టి పోటీనిచ్చిన బీజేపీ ఓడిపోయి కూడా విజయం సాధించినట్లేనని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2018 ఎన్నికల్లో 12,725 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 86,697 ఓట్లు సంపాదించడం తక్కువ విషయమేమీ కాదంటున్నారు. నిజానికి కమ్యూనిస్టులతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోకుంటే బీజేపీ విజయం నల్లేరుపై నడకే అయ్యేదంటున్నారు. మునుగోడు ఓటమితో నిరాశకు గురైన పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు మరో ఉప ఎన్నిక నిర్వహించేందుకు బీజేపీ పెద్దలు ఢిల్లీలో వ్యూహం రచిస్తున్నారు. అది కూడా పార్టీకి మంచి పట్టున్న హైదరాబాద్‌లో ఉప ఎన్నికకు ప్లాన్ చేస్తున్నారు.

భాగ్యనగరంలోనే ప్లాన్..
భాగ్యనగరంలో ఒక ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలోనే ఉంది. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఒక నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ విజయం సులభమేనని.. అప్పుడు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తుందని.. ప్రజల్లోనూ బీజేపీపై నమ్మకం పెరుగుతుందని.. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి సవాల్ విసరగలమని పార్టీ వ్యూహకర్తలు స్కెచ్ వేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేతో బీజేపీ పెద్దలు ఇప్పటికే మాట్లాడారని.. ఆయన రాజీనామా చేసి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి.

కేసీఆర్ రాష్ట్రానికే కట్టడి..
బీఆర్‌ఎస్ పార్టీ పెట్టి.. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల సహకారంతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కుట్ర పన్నుతున్న సీఎం కేసీఆర్‌ను రాష్ట్రంలోనే ఉక్కిరి బిక్కిరి చేయడానికి కూడా ఈ ఉప ఎన్నిక పనికొస్తుందని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఏకంగా ప్రధాని మోదీకే సవాల్ విసిరిన సీఎం కేసీఆర్‌ను తేలికగా వదలొద్దని.. జాతీయ స్థాయిలో పొత్తులు, కూటమి వంటి పనులు చేసేందుకు కేసీఆర్‌కు అవకాశం ఇవ్వొద్దని.. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవాలంటే మరో ఉప ఎన్నిక అనివార్యమని కమలం వ్యూహకర్తలు నిర్ధారణకు వచ్చారు.