భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగీ కన్నుమూత
భారత తొలి ఓటరు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ ఇకలేరు. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన నేగీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. నేగీ మృతికి కేంద్ర ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ నేగీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేగీ అంత్యక్రియల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

నేగీ హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో నేగీ 1917 జూలై 1న జన్మించారు. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నేగీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో చాలా దశలు 1952 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ 5 నెలలు ముందుగానే జరిగాయి. ఆ ఏడాది అక్టోబర్ 25న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి నేగీ కావడం విశేషం. ఇక నవంబర్ 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

