నక్క తోక తొక్కిన మునుగోడు ఓటర్లు..!
దీపావళికి స్వీట్లు, టపాసులతో గిఫ్ట్ ప్యాక్
పంచేందుకు సిద్ధం చేస్తున్న నాయకులు
పలుకుబడి గల నాయకులకు బైక్‌లు, కార్లు
దసరాకు మాంసం, మద్యం సీసాల పంపిణీ
మునుగోడు ఓటర్లు నక్క తోక తొక్కినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికల హడావిడిలో దసరా, దీపావళి పండుగలు రావడం ప్రజలకు కలిసొచ్చింది. ఆ రెండు ప్రధాన పండుగలు వారికి పెద్దగా ఖర్చు లేకుండానే గడిచిపోతున్నాయి. అంటే.. ఎన్నికల హడావిడిలో మునుగోడు ప్రజలు పండుగలు చేసుకోలేదని కాదు. నిరుపేదలు కూడా ఈ పండుగలను గతం కంటే మరింత వైభవంగా చేసుకున్నారు. అదెలా అంటారా..? మన నాయకులు ఉన్నారు కదా.. మనం ఏ పని అడిగినా చేయి తడపందే పూర్తి చేయని నాయకులు.. ఇప్పుడు మన ఇంటికి వచ్చి మరీ గిఫ్టుల మీద గిఫ్టులు, ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు.

దీపావళికి టాపాసులు, స్వీట్లు..
ఉపఎన్నిక నవంబరు 3వ తేదీన జరగనుంది. దీపావళి పండుగ ఈ నెల 24వ తేదీన జరగనుంది. ఈ పండుగ రోజున టపాసులు కాలుస్తూ.. స్వీట్లు తింటూ సంతోషంగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటర్లను మచ్చిక చేసుకోవాలని వివిధ పార్టీల నాయకులు నిర్ణయించారు. ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్లను దృష్టిలో పెట్టుకొని మహిళలకు, యువతకు వేర్వేరుగా దీపావళి గిఫ్ట్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. మిఠాయిలు, టపాసులతో పాటు ఓటర్లకు కానుకలతో మొత్తం 5 వేల రూపాయల విలువైన గిఫ్ట్ ప్యాకెట్లను దీపావళి సందర్భంగా పంచేందుకు నాయకులు రెడీ అయ్యారు.

బైక్‌లు, కార్లు కూడా..
అంతేకాదు.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పలుకుబడి కలిగిన నాయకులకు వారి స్థాయిని బట్టి బైక్‌లు, కార్లను పండుగ కానుకగా ఇచ్చేందుకు వివిధ పార్టీల నాయకులు బుక్ చేశారని సమాచారం. ఈ నెల 5వ తేదీన జరిగిన దసరా పండుగ సందర్భంగా కూడా మునుగోడు ఓటర్లకు కిలో చికెన్, క్వార్టర్ బాటిల్ పంపిణీ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు మాత్రం రోజూ పండగే. ఒక్కో కార్యకర్తకు ఉదయం టిఫిన్, లంచ్‌తో పాటు ప్రచారం పూర్తయిన తర్వాత రాత్రి బిర్యానీ, మందు బాటిల్, వెయ్యి రూపాయలు చేతికిచ్చి ఇంటికి పంపిస్తున్నారు. మొత్తానికి.. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకూ మునుగోడు ప్రజలు బంపర్ ఆఫర్లలో మునిగితేలుతారన్నమాట.

