హాట్ హాట్‌గా మునుగోడు ‘జంపింగ్’లు
మునుగోడు, అక్టోబరు 15(మనసర్కార్): మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. ఉప ఎన్నిక పోలింగ్‌కు 20 రోజులు కూడా లేదు. దీంతో అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. వివిధ పార్టీల నాయకుల జంపింగ్‌లు, గోడ దూకుడులు పెరిగిపోయాయి. రాజకీయ పార్టీల పొత్తులు మారుతున్నాయి. బూర నర్సయ్య గౌడ్ రాజీనామాతో టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ ఇస్తే.. పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరి కాంగ్రెస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇక అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నించి.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన టీడీపీ.. బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించింది.

బూర ప్లేస్ పల్లెతో భర్తీ..
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామాతో కంగుతిన్న టీఆర్‌ఎస్.. బీసీలు, గౌడ సామాజిక వర్గం నేతల వేటలో పడింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చండూరు ఎంపీపీ అయిన తన భార్య కళ్యాణితో కలిసి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో బూర నర్సయ్య గౌడ్ వెళ్లిపోవడంతో అదే సామాజిక వర్గం నేతతో ఆ స్థానాన్ని భర్తీ చేసినట్లు టీఆర్‌ఎస్ రిలీఫ్ ఫీల్ అయింది. మునుగోడులో బీసీలు.. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారడంతో ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన పల్లె రవిని టీఆర్‌ఎస్ నేతలు హత్తుకున్నారు.

టీడీపీ.. మునుగోడు టు ఏపీ..
చంద్రబాబు కూడా మునుగోడు టు ఆంధ్రప్రదేశ్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అందుకే.. తొలుత మునుగోడులో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయాన్ని చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో జగన్‌ను ఓడించేందుకు బీజేపీ మద్దతు తీసుకోవాలనుకుంటున్న చంద్రబాబు.. మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చి కాషాయ పార్టీకి దగ్గరవ్వాలని ప్లాన్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మద్దతివ్వాలని తెలంగాణ టీడీపీ నేతలను కోరినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని ఆ పార్టీ నాయకులు చంద్రబాబును కూడా కోరారని.. ఏపీలో బీజేపీ సహకారం పొందాలంటే మునుగోడులో వారికి సహకరించాల్సిందేనని బాబు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మునుగోడులో బీసీలు 67 శాతం..
మరోవైపు.. మునుగోడులో 90 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల ఓట్లే ఉన్నాయి. బీసీలు 67 శాతానికి పైగా ఉన్నారు. అయినా.. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ సామాజిక వర్గాల వారికి టికెట్ ఇవ్వలేదు. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రధాన పార్టీలు బీసీ వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల వేటలో పడ్డాయి. ఈ విషయంలో బీజేపీ ముందంజలో ఉందని మునుగోడు ప్రజలు చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడిన బీసీలకు కాషాయ కండువా కప్పేందుకు పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తోంది.

