తేలికైన గ్యాస్ బండ
వంట గ్యాస్ ధర భారమే కాదు, గ్యాస్ బండ బరువు కూడా భారమే. దానిని తగ్గించడానికి ఇండియన్ గ్యాస్ కంపెనీ కొత్త ఫైబర్ సిలెండర్లను మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. దాదాపు 30 కిలోల బరువుండే గ్యాస్ బండను మోయడానికి, పక్కకు జరపడానికి ఇల్లాలు ఎంతో కష్టపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడొచ్చిన సిలెండర్ భారం చాలా వరకూ తగ్గుతోంది. దీని బరువు కేవలం 6 కిలోలు మాత్రమే. దీనిలో 10 కిలోల గ్యాస్‌ను నింపితే మొత్తం బరువు 16 కిలోలు అవుతుంది. అంటే దాదాపు సగం బరువు తగ్గినట్లే. దీని ధర 810 రూపాయలు అవుతుంది. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగినా సిలిండర్ పేలకుండా ఉండేలా కూడా దీన్ని రూపొందించారు. ఇంకా ఈ సిలిండర్ అల్ట్రావయెలిట్ రేస్ నుండి కూడా గ్యాస్‌కు రక్షణ కలిగిస్తుందట. ఎంత మేరకు గ్యాస్ వినియోగించుకున్నామో కూడా తెలుసుకునేలా కొత్త సిలిండర్ ఉంటుందట. దీనిని వివిధ రకాల కంపొజిట్ పొరలతో తయారుచేశారు. ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చామని, రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని కంపెనీ చెబుతోంది.

