NewsNews AlertTelangana

వీఆర్‌ఏలు, కళాకారుల నామినేషన్ల జోరు..!

మునుగోడు ఉప ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగడంతో అటు కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇటు రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల గడువు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుకుంది. దీంతో తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, వివిధ రాజకీయ పార్టీల, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఉప ఎన్నికను వేదికగా చేసుకోవాలని వీఆర్‌ఏలు, కళాకారులు, లారీ యజమానులు, చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితులు ప్లాన్‌ చేస్తున్నారు.

కళాకారుల ఆందోళన

ఉద్యోగాల కోసం కళాకారుల ఎదురుచూపు..

తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు హామీ ఇచ్చింది. అయితే.. ఆ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో కళాకారులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక రావడంతో ఏకంగా 300 మందితో నామినేషన్లు వేయించి ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నంగా తెలపాలని కళాకారులు ప్లాన్‌ చేస్తున్నారు.

వీఆర్‌ఏల రాస్తారోకో

78 రోజులుగా వీఆర్‌ఏల ఆందోళన..

పే స్కేల్‌, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలంటూ వీఆర్‌ఏలు 78 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పిస్తే సీఎం కేసీఆర్‌ విసిరి కొట్టారు. దీంతో మునుగోడు వేదికగా తమ సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయాలని వీఆర్‌ఏలు నిర్ణయించారు. 14వ తేదీన వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తామని వీఆర్‌ఏలు హెచ్చరించారు. ఇప్పటికే కొందరు వీఆర్‌ఏలు నామినేషన్‌ వేసినట్లు తెలుస్తోంది. లారీ యజమానులు కూడా ట్యాక్స్‌ పెంపునకు నిరసనగా మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించారు.

చర్లగూడెం రిజర్వాయర్‌ భూనిర్వాసితుల ధర్నా

పరిహారం కోసం నిర్వాసిత రైతుల ఎదురుచూపు..

డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్‌ భూనిర్వాసితులు కూడా నామినేషన్లు వేసి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు గ్రామాలకు చెందిన 80 మంది రైతులు రిజర్వాయర్‌ కోసం 2115 ఎకరాల భూమి ఇచ్చారు. భూ పరిహారం మాత్రం చెల్లించారు. అయితే.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకూ ఇవ్వలేదు. దీని కోసం రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో భారీ స్థాయిలో నామినేషన్లు వేసి తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని 80 మంది రైతులు భావిస్తున్నారు. నామినేషన్ల గడువు ఈ నెల 14వ తేదీన ముగియనుంది.  అప్పటికి ఎన్ని నామినేషన్లు వస్తాయో.. ఎవరిని ప్రభుత్వం బుజ్జగిస్తుందో చూడాలి.