వద్దంటే వర్షాలు… మరో వారం రోజులు వర్ష సూచన
దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది సోమవారం తమిళనాడు సమీపానికి రానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోపాటు సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో అనేకచోట్ల మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత రెండు రోజులు కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, బంగాళాఖాతంతోపాటు భూ ఉపరితలంపై ఆవర్తనాలు కొనసాగడంతో రుతుపవనాలు బలంగా మారాయని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయన్నారు. అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొనడంతోపాటు చెరువులు, కుంటలు నిండాయని, భూగర్భజల మ ట్టాలు పెరిగాయన్నారు. అయితే వారం రోజుల వర్షాలకు కొన్నిచోట్ల మెట్ట పంటలు దెబ్బతిన్నాయన్నారు. రుతుపవనాలు తిరోగమన సమయంలో వారం రోజులపాటు వర్షాలు కురవడం వాతావరణ మార్పులను సూచిస్తోందని పేర్కొన్నారు. మరో వారం రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని తెలిపారు.