పితృదేవతలకు ప్రియం ఈ మహాలయ పక్షం
భారతదేశం కర్మభూమి. భారతీయులందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. దేవతలతో పాటు, పితృదేవతలను కూడా తలుచుకొని పూజిస్తారు. దసరా నవరాత్రుల ముందు వచ్చే పక్షం రోజులను మహాలయ పక్షాలుగా వ్యవహరిస్తారు. అంటే భాద్రపద బహుళ పక్ష పాడ్యమి నాటి నుండి భాద్రపద అమావాస్య వరకూ ఉన్న 15 రోజులన్నమాట. నిన్న సెప్టెంబరు 11 పాడ్యమి నాడు ప్రారంభమైన ఈ మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య వరకూ కొనసాగుతాయి.
మరణించిన తండ్రి, తల్లి, తాత, ముత్తాతలను తలచుకుంటూ పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది కర్మలను పితృయజ్ఞవిధులని అంటారు. వీటిని జరుపుకోవడానికి నిర్దేశింపబడిన ఈ పదునైదు రోజులనే మనం మహాలయ పక్షాలు అంటాము. భక్తిగా వారికి ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ పక్షాల ముఖ్యోద్దేశం.

ఈ చరాచర జగత్తు ఆకలి అనే సూత్రం మీదే నడుస్తోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తోంది. యజ్ఞము వలన వర్షము కురుస్తుంది. కర్మవలన యజ్ఞము సాధ్యమౌతుంది. అంటే కర్మ వల్లనే ఈ జగత్తు నడుస్తోంది. మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుందని హిందూ ధర్మం నమ్ముతోంది. ఆ ఆత్మ కర్మఫలాన్ని అనుభవించడానికి తిరిగి శిశువుగా ఈ భూమిపై జన్మిస్తుంది. పుత్రులు ఉన్నవారు వారి పితృ తిథులలో తద్ధినాలు, పిండప్రధానాలు చేస్తూ ఉంటారు.
మరి పుత్రులు లేనివారు, అయినవారు కూడా లేనివారికి కూడా సద్గతులు కల్గించడానికి, వారు అథోగతిపాలు కాకుండా చేయడానికి, వారిని ఉద్దరించడానికి మనశాస్త్రంలో చెప్పబడిన కర్మలే ఈ పక్షాలలో చేయాలి. ఈ పక్షం రోజులలో మన మూడు తరాల వారికే కాకుండా మన వంశంలో మరణించిన స్త్రీ, పురుషులందరికీ, గురువులకు, బంధువులకు, స్నేహితులకు, ఆఖరుకు ఇరుగుపొరుగు వారితో సహా మరణించిన ఎవరికైనా పిండప్రధానం చేసే అర్హత, అధికారం ఉంది. దీనిని ‘ సర్వకారుణ్య తర్పణ విధి’ అంటారు. ఈ బాధ్యతను వహించి ప్రతీ ఒక్కరూ తమకు చేతనయినంతలో ఈ మహాలయ పక్షాలలో కర్మలు చేసి చనిపోయిన వారి ఆత్మలకు ఉత్తమగతులు కల్పించాలని కోరుకుందాం.

