NationalNews Alert

180 కి.మీ స్పీడ్‌తో వందేభారత్ రైళ్లు

దేశీయంగా అభివృద్ధి చేసిన `వందేభారత్` సెమీ హైస్పీడ్‌ రైలు రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 2019లో తొలి వందేభారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ- వారణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ-వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.

తాజాగా కోటా (రాజస్థాన్‌)- నాగ్దా (మధ్యప్రదేశ్‌) సెక్షన్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 16 కోచ్‌లతో వందేభారత్ రైలును పరీక్షించారు. కోటా డివిజన్‌లో వివిధ దశల్లో ట్రయల్స్ చేపట్టారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారు చేస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్లను తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు.

రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌ చేసి.. దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం. ఈ తరహా రైళ్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో రానున్న మూడేళ్లలో 400 కొత్త వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ 2022 బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.