తలకు మించిన అప్పుల తిప్పలు
పూర్వం మన తండ్రులు, తాతలు సంపాదనను బట్టి ఖర్చులు పెట్టేవారు. “ఎంత చెట్టుకు అంత గాలి” అన్నట్లు ఎంత సంపాదిస్తే అంతలోనే పబ్బం గడుపుకునేవారు. ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలంటే డబ్బు కూడబెట్టి, కొన్నాళ్ల తర్వాత గానీ ఆ వస్తువును కొనలేకపోయేవారు. దాన్ని వాడుకుంటే వచ్చే ఆ ఆనందమే వేరు. కానీ ఇప్పుడు జీతాలు పెరిగాయి. కానీ ఏంలాభం. దానికి తగినట్టే ఖర్చులు కూడా పెరిగి, కోరికలు పెరిగి కుటుంబ భారం తడిసి మోపెడవుతోంది.

అంతేకాదు స్నేహితులను, బంధువులను చూసి వారింట్లో ఉన్న వస్తువులాంటిదే మనకూ కావాలని సంపాదనను మించి వ్యయం చేయడం పరిపాటయిపోయింది. దానికితోడు అడగకుండానే అప్పులు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, అప్పులు ఇస్తామంటూ ఫోన్లు చేస్తూ వడ్డీ లేని ఋణాలు అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూంటారు. దానితో అవసరం లేకున్నా ఋణాలు తీసుకుని వాళ్ల వలలో పడిపోతూంటారు. సమయానికి చెల్లించలేకపోతే అంతే సంగతులు. రూపాయికి పది రూపాయలు చెల్లిస్తే కానీ బయటపడలేరు. దానితో అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు ప్రతినిత్యం పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉంటాము. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయల జీతం అనుకుందాం. సాఫీగా జరిగిపోయే అతని జీవితంలో ఒక ఫ్లాటు అప్పుచేసి కొన్నాడనుకుందాం. ఇల్లు ఉంటే కారు కావాలనిపిస్తుంది. తర్వాత ఇంటిలో పెద్ద టీవీ, ఇతర గృహోపకరణాలు ఖరీదైనవి కావాలనిపిస్తుంది. దీనితో అన్నింటికీ ఋణాలు చేసి జీతంలో సగానికి పైగా వడ్డీలు కట్టుకుంటూ చివరికి ఇల్లు గడవడమే కష్టమయ్యే పరిస్థితి తెచ్చుకుంటారు. ఇలాంటి ఎంతోమందిని ఈరోజుల్లో చూస్తున్నాం. ఋణాలు సులువుగా దొరుకుతున్నాయని తీసుకునే వారెందరో ఉన్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేక భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా క్రెడిట్ కార్డుల రూపంలో ఇప్పుడే ఖర్చు చేసేస్తూ ఉంటారు.

ఋణం సులభంగా తీర్చే మార్గాలను తెలుసుకుందాం...
ముందుగా శక్తికి మించి అప్పులున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. దీనికోసం ముందుగా ఖర్చులను తగ్గించుకుంటూ, మిగులు మొత్తాన్ని కాస్త ఉంచుకుంటూ, వాయిదాలను క్రమంగా చెల్లించుకోవాలి. మన దగ్గరున్న బ్యాంకు డిపాజిట్లు, అప్పులు, ఈక్విటీలు, స్థిర చరాస్తులు అన్నింటినీ ఒకసారి లెక్క చూసుకోండి. ఎంత మనకు వెంటనే వెనక్కు తీసుకోగలమో చూసుకుని వెంటనే 10 శాతానికి మించి వడ్డీ ఉన్న అప్పులను తీర్చడానికి ప్రయత్నించండి. తప్పని సరి అయితే కొంత తక్కువ విలువ ఉన్న ఆస్తిని అమ్మడానికి ప్రయత్నించండి. అప్పు తగ్గితే కొంత మనస్సు స్థిమితపడి పెట్టుబడులపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. అప్పు ఇస్తున్నారు కదా అని తీసుకోకూడదు. మన ఆదాయాన్ని బట్టి ఋణ వాయిదాలను లెక్కవేసుకోవాలి. అప్పుపై వస్తువులను కొనుగోలు చేయడం మానుకోవాలి.

మన మొత్తం ఆదాయంలో ఇంటి ఋణ వాయిదా 40 శాతం మించకూడదు.
క్రెడిట్ కార్డును 12శాతం మించి వాడవద్దు.
కారు ఋణం 5 శాతం ఉండేలా చూసుకోండి.
ఇక వ్యక్తిగత ఋణాలు 2శాతం కన్నా తక్కువ ఉండాలి.
ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆస్తులను సృష్టించేవి మంచి అప్పులు. ఆస్తులను పోగొట్టేవి చెడ్డ అప్పులు. అధిక వడ్డీలకు ఏ పరిస్థితుల్లోనూ అప్పులు తీసుకోకూడదు.
ఈ నియమాలు పాటిస్తూ సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి.