డీజీపీ కార్యాలయం ముట్టడికి టీడీపీ యత్నం
కుప్పం ఘటనకు వ్యతిరేకంగా విజయవాడలోని డీజీపీ కార్యాలయాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించే ప్రయత్నం చేశాయి. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ దాష్టీకంపై మండిపడ్డారు. అక్కడనే బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. కడపలో సమావేశం పెడతాం ఎలా అడ్డుకుంటారో చూస్తామన్నారు అచ్చెన్నాయుడు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తెలుగుదేశానికి ఉందని అన్నారు. కుప్పం ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వచ్చి విధ్వంసం సృష్టించారని కుప్పం ఘటనపై స్పందిస్తూ .. వైసీపీపై మండి పడ్డారు. పేదల కండుపు నింపే అన్నా క్యాంటిన్లను అడ్డుకోవడం అంటే పేదల కడుపు కొట్టడమేనని అన్నారు కేశవ్. తమపై చెయ్యెత్తిన ఏ ఒక్కరినీ వదిలేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ కి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. కుప్పం ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. కడప కలెక్టరేట్ దగ్గర టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


