NewsNews AlertTelangana

చల్లారని అరెస్టుల మంటలు

ఓవైపు నిరసనలు.. మరోవైపు దీక్షలు.. ఇంకోవైపు గృహ నిర్బంధం.. బండి సంజయ్‌, రాజాసింగ్‌, బీజేవైఎం కార్యకర్తల అరెస్టుల మంటలు చల్లారడం లేదు. తెలంగాణాలో మంగళవారం రాజకీయ మార్పులు అత్యంత వేగంగా జరిగాయి. బీజేపీ నాయకులపై కేసీఆర్‌ సర్కారు కక్ష సాధింపు ధోరణితో పెట్టిన అత్యంత కఠినమైన కేసులు కోర్టుల్లో వీగిపోయాయి.

బండి సంజయ్‌ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్‌కు బీజేపీ నేతల వినతి

ముఖ్యంగా మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివాదంపై మంగళవారం తెల్లవారుజామునే అరెస్టు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రాత్రి అయ్యే సరికి బెయిల్‌ మంజూరైంది. నాంపల్లి కోర్టు నుంచి పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రాత్రి 10 గంటలకు ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చినందున తాను ఎవరితో ఏమీ మాట్లాడబోనని మీడియాకు రాజాసింగ్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కారు తనపై తొలి నుంచీ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు.

ఇంటి వద్ద రాజాసింగ్‌

పాతబస్తీలో కొనసాగుతున్న ఆందోళనలు

రాజాసింగ్‌ అరెస్టును జీర్ణించుకోలేని మజ్లిస్‌ పార్టీ నేతలు మంగళవారం రాత్రి పాతబస్తీలో స్థానికులను రెచ్చగొట్టి నిరసనలు చేపట్టారు. రాజాసింగ్‌ను సస్పెండ్‌ చేసి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా బీజేపీ చర్యలు తీసుకున్నా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఓ వర్గం వారిని రెచ్చగొడుతున్నారు. చార్మినార్‌ వద్ద భారీ సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనను అరెస్టు చేయాలంటూ మొఘల్‌పురాలో పోలీస్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం కూడా చార్మినార్‌ పరిసరాల్లో యువకులు గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గోషామహల్‌కు వెళ్లే రోడ్లను మూసేశారు. మరోవైపు రాజాసింగ్‌పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసుల పరంపర కొనసాగుతోంది.

ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన

బీజేవైఎం కార్యకర్తలపై మారిన కేసులు

మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ప్రమేయం ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద ధర్నా చేసిన 80 మంది బీజేవైఎం కార్యకర్తలపై తొలుత హత్యాయత్నం కేసులు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు తర్వాత కేసుల ఉధృతిని తగ్గించారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద న్యూసెన్స్‌, పోలీసులపై దాడికి పాల్పడిన సెక్షన్లతో పాటు మరో కొన్ని సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. మొత్తానికి మూడుసార్లు కేసులను మార్చారు. వారిని ఆన్‌లైన్‌లో జడ్జి ముందు ప్రవేశపెట్టగా బెయిల్‌ ఇవ్వడంతో పోలీసులు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ యువ నాయకులపై పకడ్బందీ కేసులు పెట్టి బెయిల్‌ రాకుండా ఇబ్బందికి గురి చేయాలన్న కేసీఆర్‌ సర్కారు వ్యూహం బెడిసి కొట్టడంతో టీఆర్‌ఎస్‌ నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.

గృహ నిర్బంధంలో బండి సంజయ్‌

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు

ధర్మ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ ఇంకా విడుదల కాలేదు. బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయనను ఇంటి నుంచి బయటికి రానివ్వకపోవడంతో బీజేపీ నేతల వరుస అరెస్టులకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలతో పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను కొనసాగించి తీరుతామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే వెళ్తామని.. ఈ నెల 27వ తేదీన హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. పాదయాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతివ్వాలంటూ హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది.