Andhra PradeshNewsNews Alert

మోదీ కాళ్ళు పట్టుకునేందుకే ఢిల్లీ టూర్: దేవినేని ఉమ ఆరోపణ

ఎందుకు వచ్చారు.. ఎందుకు వెళ్ళారు.. ఏం సాధించారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు ఇవి. స్వప్రయోజనాల కోసమే కానీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఆరోపణలు చేస్తున్నాయి. అసలు ప్రధానితో జగన్ ఏం మాట్లాడారు ? ప్రధానికిచ్చిన విజ్ఞానపత్రంలో ఏముంది ? ఇది ఎవరికీ అంతు బట్టని విషయమని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళారు .. కానీ ఏం సాధించారు. ప్రభుత్వానికి ఖర్చు తప్పించి రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యం అంటూ టీడీపీ నేతలు మండి పడుతున్నారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన ఏపీ సీఎం జగన్.. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ ను కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు సత్వరమే విడుదల చేయాలని, తెలంగాణ డిస్కమ్ ల నుండి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో చొరవ తీసుకోవాలని ప్రధానిని కోరారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుసుకున్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా సొంత ప్రయోజనాల కోసమేనని టీడీపీ అంటోంది. రాష్ట్ర విభజన చట్టంలో మన హక్కుగా ఉన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను భ్రష్టు పట్టించారని, పోలవరం నిర్వాసితులకు అందించిన సాయం కూడా ఏమీ లేదని టీడీపీ దుయ్య బట్టింది. ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. నిర్వాసితులకా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఖర్చు మాత్రం 4500 కోట్లు అయ్యాయని చెబుతున్నారు. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 31 మంది ఎంపీలు ఉన్నా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేని నిస్సహాయ స్ధితిలో వైసీపీ ఉందని దేవినేని విమర్శించారు.

ఒక ప్రణాళిక లేదు.. నిర్వహణా లోపం.. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం.. ఏజెన్సీల మద్య సమన్వయం లేకపోవడం.. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్ట్ కు ఇలాంటి దుస్థితి పట్టిందని దేవినేని అన్నారు. పోలవరం నిర్వాసితులను అక్కడ నుండి వెళ్ళగొట్టేందుకు నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. గిరిజనులు .. గిరిజనేతరులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని తప్పిదాలు చేసిన వైసీపీకి ఇక కాలం చెల్లినట్లేనని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటన కేవలం తన స్వప్రయోజనాల కోసమేనని దేవినేని అన్నారు. బాబాయి హత్య కేసు, బీచ్ శాండ్ అవినీతి కేసు, మాధవ్ ను రక్షించే ప్రయత్నాల కోసమే ప్రధానిని జగన్ కలుసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.