అల్లుడిని గిల్లితే పదవి గోవిందా..
గద్దెనెక్కి రెండు వారాలు కాలేదు. కొత్త సంసారంలో అప్పుడే తల నొప్పి మొదలయ్యింది. అన్ని విషయాలలో లాలూ గ్యాంగ్ వేలు పెట్టడం ప్రారంభించింది. చెప్పలేడు.. కానీ వారు వేళ్ళూ.. కాళ్ళు పెడుతూ ఉంటే ఎలా ? భరించలేక పోతున్నాడు. పదవి కావాలంటే ఓర్చుకోవాల్సిందే. కానీ.. అంతా పెత్తనం చేయాలంటే .. ఎలా తట్టుకోవాలి ? ఎలా మూడేళ్ళు నెట్టుకు రావాలి ? తెలియని మనో వేదన నితీష్ కుమార్ ను నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది.

గూడు మార్చాడు సరే.. అక్కడ ఎలాంటి పరిస్ధితులు ఉంటాయి.. ఎలా నెట్టుకు రావాలి అన్నది ఆలోచించలేక పోయాడు. పదవే పరమావధిగా .. అదే అసలైన సిద్ధాంతంగా భావించే నితీష్ కుమార్ కు ఇప్పుడు ఆర్జేడీతో ఎలా నెట్టుకు రావాలా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎన్.డీ.ఏలో ఇమడలేక పోయాడు. మరి ఇక్కడ ఇమడ గలడా.. పూర్తి కాలం పదవిలో నెగ్గుకు రాగలడా ? పైకి అనకపోయినా ఆర్జేడీలో మంత్రి పదవులు లభించని వారంతా ఇలాగే చెవులు కొరుక్కుంటున్నారు. అయ్యకి వారే తిక్క కుదురుస్తారులే అని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. పాపం.. నితీష్ మనోవైదనను అర్ధం చేసుకుని ఊరడించేవారు.. సరైనా సలహాలు ఇచ్చే వారు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని అధికారిక సమావేశాల్లో ఇప్పుడు లాలూ గ్యాంగే ఎక్కువగా కనిపిస్తూ ఉందిట. చట్ట సభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేని లాలూ ముద్దుల అల్లుడు శైలేష్ కుమార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో పాల్గొన్న వీడియోలు ఇప్పుడు సమాజక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నితీష్ అంటే పదవిని కాపాడుకోవడానికి కిమ్మనకుండా ఉండొచ్చు. మరి విపక్షాలు చూస్తూ ఊరుకుంటాయా. మండిపడ్డాయి. దొరికింది కదా అస్త్రం అనుకుని విమర్శలు గుప్పించాయి.

అసలే అది లాలూ ఫ్యామిలీ. దానికి తోడు అల్లుడు. మరి అతన్ని గిల్లితే ఊరుకుంటారా. చెవి మెలిపెట్టరు. అదే జరుగుతోంది అక్కడ. విపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయాల్సిన పరిస్ధితి వచ్చింది నితీష్ కి. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన అధికారిక విధులను బావ శైలేష్ యాదవ్ కి అవుట్ సోర్సింగ్ ఇచ్చాడంటూ బీజేపీ సెటైర్లు వేస్తోంది. అంతే కాదండోయ్.. ఆయనే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాడట అంటూ ఎద్దేవ చేస్తోంది బీజేపి. ఇప్పుడు బీహార్ లో షాడో సీఎంలు చాలా మందే ఉన్నారంటూ ఎన్.డీ.ఏ పార్టీలు జోకులేయడం నితీష్ కు మండుతోంది. కానీ.. ఏం చేస్తాడు. అల్లుడిని గౌరవించాల్సిందే. వారికి కోపమొస్తే గద్దె దిగాల్సిందే. పాపం.. అడకత్తెరలో పోక చెక్క చందంలా మారింది నితీష్ పరిస్ధితి.
