టీఆర్‌ఎస్ నుండి బీజేపీలోకి భారీగా వలసలు -ఈటల
బీజేపీ కొట్టే దెబ్బకు కేసీఆర్ మతి భ్రమించడం ఖాయమని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ అహంకారంపై జరిగే యుద్ధమే మునుగోడు ఎన్నిక అని అన్నారు. గురువారం భువనగిరిలో ఈటెల సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, టీఆర్ ఎస్ మండల కార్యదర్శి కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, అవుషాపూర్ సర్పంచ్ మచ్చేందర్ రెడ్డి, గట్టుప్పల్ మండలానికి చెందిన పలువురు నేతలు వీరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని తాము కూల్చాల్సిన అవసరం లేదని, అదే కూలిపోబోతోందని పేర్కొన్నారు. కేసీఆర్‌కి, ఎమ్మెల్యేలతో ఎలాంటి అనుబంధం లేదని, కేవలం పరస్పర అవసరాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను హుజూరాబాద్‌లో ఎలా బొందపెట్టారో, మునుగోడులో కూడా అలాగే జరగబోతోందని జోస్యం చెప్పారు. చాలామంది టీఆర్‌ఎస్ నుండి బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడం కోసమే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. బీజేపీలో చేరబోతున్న ఎంపీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్‌లను ప్రభుత్వం బెదిరిస్తోందని, సొంతపార్టీవారినే తిరగి పార్టీలో చేరుతున్నట్లు మళ్లీ కండువాలు కప్పుతున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.