నకిలీ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు
మనం ఏ సమాచారం తెలుసుకోడానికైనా ఎక్కువగా వాడే మాధ్యమం YOU TUBE. ఎందుకంటే ఇది ఆకర్షనీయంగా, వీడియోల రూపంలో చక్కగా అర్థమయ్యేలా ఉంటుంది. చదువు రాని వారు కూడా విషయాలను చదవకుండానే అర్థం చేసుకోవచ్చు. అందుకే అతి తొందరగా ప్రజల్లో ప్రచారం పొంది, అందరికీ అలవాటయిపోయింది. దీని ప్రాధాన్యత తెలిసి అతి తొందరలోనే అనేక యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా అనేక మంది తమ తమ ప్రచారాలను చేసుకుంటున్నారు. అయితే వీటితో లాభాలెన్నో నష్టాలు కూడా అదే స్థాయిలో బయటపడుతున్నాయి. కొందరు నకిలీ వార్తలు ప్రచారం చేయడం వల్ల వాటి వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రం కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు. తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై నిషేధాలు విధిస్తున్నారు.

తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం (ఈరోజు) 8 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. దీనిలో 7 భారత్‌కు చెందినవి కాగా.. 1 పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ ఛానెళ్లకు ఎంతమంది సబ్ స్కైబర్స్ ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్షరాలా 85 లక్షలమంది ఉన్నారు. వీటిని 114 కోట్లకు పైగా ప్రజలు చూస్తున్నారు. అయితే ఈ వీడియోలలో కొన్ని వర్గాల ప్రజలమీద ద్వేషం పెంచేలా వీడియోలు చిత్రీకించినవి, దేశభద్రతకు, విదేశీ వ్యవహారాలకు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించినవి మొదలైన అనేక అంశాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిసింది. అందుకే ఈ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు తెలిసింది. భారత సాయుధ బలగాలకు , జమ్మూకాశ్మీర్‌కు వ్యతిరేఖంగా ఈ ఛానెళ్లు నకిలీ వార్తలు ప్రచారాలు చేస్తున్నాయి. దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి ఎవరైనా భంగం కలిగించేలా వీడియోలు చేసి, యూట్యూబ్‌లో పెడితే కఠిన చర్యలు ఉంటాయని సమాచార మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ఆన్లైన్లో ప్రామాణికమైన, సురక్షిత వార్తలు మాత్రమే ఉండాలని, తప్పుడు వార్తలు ప్రచారంచేయరాదని సమాచార మంత్రిత్వశాఖ తెలిపింది. గత సంవత్సరం నుండి ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం 102 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది.

